'మజ్ను' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్. కెరీర్ మొదట్లోనే బంపర్ ఛాన్సులు అందుకోవడంతో స్టార్ హీరోయిన్ అయిపోవడానికి ఇంకెంతో సమయం పట్టదనుకున్న తరుణంలో 'అజ్ఞాతవాసి' రూపంలో విధి ఆడిన వింత నాటకంలో అనూ ఇమ్మాన్యుయేల్ కెరీర్ దారుణంగా దెబ్బ తినేసింది. అంతవరకూ ఆకాశానికెత్తేసిన అనూ ఇమ్మాన్యుయేల్‌ని అమాంతం ఐరెన్‌లెగ్ బిరుదిచ్చి పక్కకు నెట్టేశారు.
దాంతో అనూ ఇమ్మాన్యుయేల్‌కి చేజిక్కించుకున్న బిగ్ బిగ్ ఆఫర్లు కూడా చేజారిపోయాయి. తర్వాత ఎంత కష్టపడినా, నిలదొక్కుకోవడం కష్టమైపోయింది పాపం అనూకి. దాంతో కొన్నాళ్లు గ్యాప్ తీసుకుంది. ఈ మధ్యనే మళ్లీ అనూ పేరు తెరపైకి వచ్చింది. అదీ ఓ తమిళ సినిమాతో. తమిళంలో జోరు మీదున్న యంగ్ హీరో శివకార్తికేయన్‌తో అను ఇమ్మాన్యుయేల్‌కి ఓ ఛాన్స్ వచ్చింది. పాండిరాజ్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటిస్తున్న సినిమాలో అనూ ఓ హీరోయిన్‌గా ఎంపికైంది.
ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకి 'ఎస్ కే 16' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. గతంలో తమిళంలో అనూ ఇమ్మాన్యుయేల్ విశాల్ సరసన 'ఇరుంబుతిరై' సినిమాలో నటించింది. ఈ సినిమాతో అనూకి మంచి పేరే వచ్చింది కానీ, ఆఫర్లు లేక ఆ గుర్తింపు కంటిన్యూ కాలేదు. సక్సెస్‌ఫుల్ సినిమాలతో దూసుకెళుతోన్న శివ కార్తికేయన్ పుణ్యమా అని అనూకి వచ్చిన ఈ ఛాన్స్‌తోనైనా మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుందేమో చూడాలిక.