మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శైలజారెడ్డిగా రమ్యకృష్ణ నటిస్తుండగా, ఆమె కూతురు 'అను' పాత్రలో అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. ఈ తల్లీ కూతుళ్లకు సినిమాలో చాలా ఈగో అని ఇంతవరకూ విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తుంటే అర్ధమయిపోతోంది.
అయితే ఒరిజినల్‌గా అనూ క్యారెక్టర్ విషయానికి వస్తే ఈ భామకు రియల్ లైఫ్‌లో కూడా ఈగో ఎక్కువే అనిపిస్తోంది. ఈ మధ్య అనూ ఇమ్మాన్యుయేల్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం అమ్మడు చాలా చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాపై. అందుకే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో తన మనసులో దాచుకున్న కొన్ని మాటల్ని అలా అలా పైకి వదిలేస్తోంది. సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి మన చేతుల్లో ఉండవంటోంది.
అంతేకాదు, 'అజ్ఞాతవాసి' సినిమాని ఒప్పుకునేప్పుడు చాలా చాలా ఆలోచించి ఓకే చేసిందట. అయినా, పవన్, త్రివిక్రమ్ సినిమా అంటే ఆఫర్ వస్తే ఎవరైనా వదులుకుంటారా చెప్పండి? అని తిరిగి ప్రశ్నిస్తూనే, కథ నచ్చి ఒప్పుకున్నానని ప్లేట్ ఫిరాయించేస్తోంది. అంతేనా 'గీత గోవిందం' ఆఫర్ కూడా మొదట్లో తనకే వచ్చిందంటోంది. అయితే ఆప్పుడు బన్నీతో 'సూర్య' సినిమా కోసం బిజీగా ఉన్న కారణంగా వదులుకోవల్సి వచ్చిందంటోంది.
ఆ సినిమా ఇంత సక్సెస్ అయినందుకు అమ్మడు బాగా జలసీ ఫీలవుతున్నట్లు కనిపిస్తోంది. ఏమో చూద్దాం అమ్మడి ఓవర్ కాన్ఫిడెన్స్ వర్కవుట్ అయ్యి 'శైలజారెడ్డి అల్లుడు' హిట్ అయ్యిందంటే ఇంతవరకూ ఈ ముద్దుగుమ్మపై వస్తున్న విమర్శలకు చెక్ పడినట్లే. దశ తిరిగినట్లేగా మరి. లెట్స్ వెయిట్ అండ్ సీ.!