నటీనటులు: రాజ్ తరుణ్, కాశీష్ ఖాన్, అజయ్, రవి కృష్ణ, అరియానా తదితరులు
దర్శకత్వం : శ్రీను గవిరెడ్డి
నిర్మాతలు: సుప్రియ యార్లగడ్డ
సంగీత దర్శకుడు: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: విజయ్ బిన్ని
ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్
రేటింగ్: 2.5/5
వరుసగా మూడు హిట్లతో ఒక్కసారిగా దూసుకొచ్చాడు రాజ్‌తరుణ్. అయితే అదే జోరులో అపజయాలు చుట్టుముట్టాయి. వరసగా సినిమాలు నిరాశ పరిచాయి. చేసిన కొన్ని ప్రయోగాలు కూడా ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ తనకు కలిసివచ్చిన జోనర్ ఓ సినిమా చేశాడు. అదే ‘అనుభవించు రాజా’. రాజ్‌తరుణ్ తో గతంలో సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు తీసిన గవిరెడ్డి శ్రినివాస్ రెడ్డి ఈ సినిమాకి దర్శకుడు. అన్నపూర్ణ లాంటి నిర్మాత సంస్థ నుంచి ఈ సినిమా రావడంలో ఇంకా ఆసక్తి పెంచింది. ఈ సినిమా విజయంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు రాజ్ తరుణ్. మరి రాజ్ తరుణ్ కోరుకున్న విజయం దక్కిందా? ఇంతకీ ‘అనుభవించు రాజా’ కథ ఏమిటి ?
కథ:
రాజు (రాజ్ తరుణ్) భీమవరంలో మంచి స్థితిమంతుడు. కానీ మాణిక్ భాషా టైపులో హైదరాబాద్ లోని ఓ కంపెనీలో సెక్యురిటీగా గార్డ్ గా ఉంటాడు. అదే కంపనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది శ్రుతి (కాశిక్ ఖాన్). రాజుని కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనుకుని దగ్గర అవుతుంది. కట్.. చేస్తే రాజుని చంపడానికి ఓ గ్యాంగ్ సుపారీ తీసుకొని ఒకసారి ఎటాక్ చేస్తుంది. ఈ గ్యాప్ లో రాజు సాఫ్ట్ వేర్ కాదు కనీసం సాఫ్ట్వేర్ స్పెల్లింగ్ కూడా రాదని శ్రుతికి తెలిసిపోతుంది. ఇంతకీ రాజు ఎవరు? అతడ్ని పై హత్యప్రయత్నం ఎందుకు జరిగింది? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
అతి సింపుల్ గా కనిపించే అతి కష్టమైన జోనర్ కామెడీ. నవ్వుకోవడం ఈజీగానే వుంటుంది. కానీ ఆ నవ్వు తెప్పించడం అంత సులువు కాదు. తెరపై హీరో చలాకీగా వుండి, పది మంది కమెడియన్లు పెట్టి, కామెడీ సీన్లు రాసుకొని వెళ్ళిపోతే నవ్వుపుట్టేయదు. సినిమాలో హీరో ఒక్కసారి కూడా నవ్వకపోయినా బోలెడంత కామెడీ క్రియేట్ చేయొచ్చు. రీసెంట్ గా వచ్చిన డాక్టర్ వరుణ్ దీనికి మంచి ఉదాహరణ.
వినోదాత్మక సినిమా తీయాలంటే ముందు స్క్రిప్ట్ వినోదాత్మకంగా వుండాలి. ఒక లైన్ అనుకోని కామెడీ చేసేయొచ్చులే అనుకుంటే మాత్రం నవ్వులు పాలయ్యే ప్రమాదం వుంది. ‘అనుభవించు రాజా’కి కూడా ఇదే పరిస్థితి ఎదురైయింది. ఒక లైన్ అనుకున్నారు. హీరో వూర్లో సౌండ్ పార్టీ. ఓ కారణం వల్ల సిటీలో సెక్యురిటీగా చేరుతాడు.. ఈ లైన్ తో బోలెడు కామెడీ చేసే వచ్చనే ఆలోచనతో షూటింగ్ కి దిగిపోయారు. కానీ అటు కామెడీ పండక, ఇటు ఎమోషనల్ గా తేలిపోయి.. చివరికి ప్రేక్షకుడు టికెట్టు కొన్నందుకు అనుభవించాల్సిందే అనే టైటిల్ జస్టిఫీకేషన్ ఇచ్చుకున్నాడీ రాజా.
సినిమా మొదలైనదగ్గర నుంచి ప్రేక్షకుల నవ్వించే ప్రయత్నం చేశారు. కానీ బలంతంగా నవ్వించే ప్రయత్నమే జరిగింది. నవ్వు.. పైరు గాలి లాంటింది. అది సహజంగ వస్తేనే దాని ఫీల్ ని అనుభవించగలం. ఫోర్స్ చేసి పైరు గాలి సృస్టించకూడదు. అనుభవించు రాజాలో మాత్రం నవ్వుని ఫోర్స్ గా తెప్పించే ప్రయత్నం జరిగింది. వాస్తవానికి ఈ సినిమా ట్రైలర్ లోనే కధ పై ఓ క్లారిటీ ఇచ్చేశారు. అయితే కొన్ని మలపులు రాసుకుని తప్పకుండ అవి ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తాయనే నమ్మకంతో ట్రైలర్ లో కధ చెప్పారనిపిస్తుంది.
కానీ దర్శకుడు రాసుకున్న ఆ ట్విస్ట్ లు, టర్న్ లు ఆడియన్స్ కి ముందే తెలిసిపోతుంటాయి. రీలుకి రీలు అయిపోతుంటుంది కానీ అసలు కధ ముందుకు వెళుతున్న ఫీలింగ్ రాదు. సెకండ్ హాఫ్ లో భీమవరం వచ్చిన తర్వాత మంచి కామెడీ వుంటుందేమో అని భావించిన ప్రేక్షకుడికి ఇక్కడ నిరాశ తప్పదు. పండగ, సొంతవూరు నేపధ్యంలో చెప్పిన కొన్ని డైలాగులు బావున్నా .. అవి కధకి ఎలాంటి సాయం చేయవు. మధ్యలో మర్డర్ మిస్టరీ ఇరికించి కధని మరో జోనర్ కి షిఫ్ట్ చేయాలనే ఆలోచన కూడా దెబ్బకొట్టింది. టోటల్ గా రాజా .. ఒక కొత్త సినిమా చూసిన అనుభవాన్ని కలిగించలేకపోయాడు.
నటీనటులు:
రాజ్ తరుణ్ కి అలవాటైన పాత్ర. ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే రాజ్ లో కామెడీ టైమింగ్ ని సరిగ్గా వాడుకోలేకపోయాడు దర్శకుడు. హీరోయిన్ అందం అభినమ రెండూ మైనస్. సుదర్శన్ కాస్త నవ్వించాడు. అజయ్ పాత్ర కూడా బావుంది, మిగతా పాత్రలు పరిధి మేర చేశారు.
సాంకేతికంగా :
అన్నపూర్ణ బ్యానర్ లో వచ్చిన సినిమా ఇది. నిర్మాణ పరంగా క్యాలిటీ వుంది కానీ కంటెంట్ పరంగా కొంచెం క్యాలిటీ తగ్గింది. మ్యూజిక్ ఓకే. మళ్ళీ మళ్ళీ వినాలనే పాటలేం లేవు. కెమరాపనితనం బావుంది. నిర్మాణంలో రాజీ పడలేదు.
ప్లస్ పాయింట్స్ :
రాజ్ తరుణ్
కొన్ని కామెడీ సీన్లు
మైనస్ పాయింట్స్
కధలో కొత్తదనం లేకపోవడం
బోరింగ్ స్క్ర్ఫీన్ ప్లే
ఫైనల్ వర్దిక్ట్ : బోరింగ్ బంగారం