ప్రముఖ కథానాయిక అనుష్క సోదరుడు గుణ రంజన్ శెట్టి ని హత్య చేసేందుకు ఓ వర్గం ప్రయత్నిస్తోందన్న వార్త బెంగళూరులో కలకలం సృష్టిస్తోంది. తనకు ప్రాణాపాయం ఉందని, తనకు రక్షణ కల్పించాలని రంజన్ శెట్టి కర్నాటక హోం మినిస్టర్‌కి వినతి పత్రం అందించారు. అసలు వివరాల్లోకి వెళ్తే..
అనుష్క సోదరుడు గుణ రంజన్కి కర్నాటకలోని గ్యాంగ్ స్టర్స్‌తో సంబంధాలు ఉన్నాయి. కర్నాకలో మాఫియా డాన్ గా పేరొందిన మత్తప్పరైకి గుణ రంజన్ కీలక అనుచరుడు. మత్తప్పరై చనిపోయాక.. ఆ స్థానం కోసం గట్టిపోటీ ఎదురైంది. గుణ రంజన్‌తో పాటుగా, మత్తప్పరైకి మన్విత్ రాయ్ అనే మరో సహాయకుడు ఉన్నారు. ముత్తప్పరై స్థానం కోసం గుణ రంజన్, మన్విత్ ల మధ్య విబేధాలు మొదలయ్యాయి. ఎలాగైనా గుణ అడ్డు తొలగించుకోవాలని మన్విత్ స్కెచ్ వేశాడట.
కొంతకాలంగా ఈ మాఫియా సామ్రాజ్యానికి దూరంగా ఉంటున్నారు గుణ. కర్నాటకలో ఓ పార్టీని కూడా స్థాపించారు. రాజకీయ వర్గాల్లో కాస్తో కూస్తో పలుకుబడి సంపాదించారు. ఇవన్నీ ఓర్వలేక... మన్విత్ రంగంలోకి దిగాడని, తన సమీప బంధువులతో స్కెచ్ వేయించి గుణని హత్య చేయాలని చూస్తున్నాడని గుణ అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాల్లో నిజానిజాలను వెలికి తీయడానికి బెంగళూరు పోలీసులు కూడా ఇప్పుడు రంగ ప్రవేశం చేశారు. ప్రస్తుతం బెంగళూరులో ఇదే హాట్ టాపిక్.