విలక్షణ చిత్రాల దర్శకుడు మణిరత్నం త్వరలో 'పొన్నియన్ సెల్వన్' అనే ఓ భారీ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించ బోతున్నాడు. ప్యాన్ ఇండియన్ మూవీగా భారీ బడ్జెట్‌తో భారీ కాస్టింగ్‌తో ఈ సినిమాని రూపొందించనున్నారు. వివిధ భాషల నుండి పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటించనున్నారు. ఆ లిస్టులో స్వీటీ బ్యూటీ అనుష్క పేరు కూడా ఉందనే ప్రచారం జరిగింది ఈ మధ్య. చారిత్రాత్మక చిత్రాల్లో సౌత్ నుండి ముందుగా గుర్తొచ్చే పేరు అనుష్కే కదా మరి. అయితే, అనుష్క ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. ఈ మధ్య అనుష్క చాలా చారిత్రాత్మక చిత్రాల్లో నటించింది. ఆయా చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు కూడా తీసుకొచ్చాయి.
కానీ, చారిత్రాత్మక చిత్రాలకు ఎక్కువగా డేట్స్ కేటాయించాల్సి వస్తోందట. తద్వారా విశ్రాంతి దొరక్క హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయట. అందుకే ఆ నేపథ్యమున్న చిత్రాలకు కొన్నాళ్లు బ్రేక్ ఇవ్వాలనుకుంటోందట స్వీటీ. అయితే అలాంటి అవకాశాలు చాలా అరుదుగా మాత్రమే వస్తుంటాయి. అందులోనూ మణిరత్నం వంటి దర్శకులతో పని చేసే ఛాన్స్‌ని ఎవ్వరూ వదులుకోరు. అలాంటిది నిజంగానే స్వీటీ ఈ ఆఫర్ వదులుకుంటుందా..? ఏమో క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతం అనుష్క ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటోన్న మాట వాస్తవమే. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత మొన్న 'సైరా'లో గెస్ట్ రోల్‌లో తళుక్కున మెరిసింది. త్వరలో 'నిశ్శబ్ధం' అనే డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.