'అరుంధతి', 'రుద్రమదేవి', 'బాహుబలి'.. తాజాగా 'భాగమతి'. ఇలా భారీ బడ్జెట్ చిత్రాలతో భారీ సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకున్న బ్యూటీ అనుష్క. గత పదమూడేళ్లుగా తెలుగు ఇండస్ట్రీని ఒంటి చేత్తో ఏలుతున్న స్టార్ హీరోయిన్. హీరోయిన్‌గా ఎన్ని సక్సెస్‌లు అందుకున్నా ఒక్కటే లోటు అనుష్కకి మిగిలిపోయిందట. అదేంటంటే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం.
ఈ మధ్యనే తెలుగు తెరకు పరిచయమైన పలువురు బ్యూటీస్ తెలుగు భాషపై పట్టు సాధించేసి, తమ పాత్రలకు తమ సొంత గొంతునే వాడేస్తున్నారు ధైర్యంగా. అయితే ఆ విషయంలో అనుష్క మాత్రం ఎందుకు సాహసం చేయలేదంటారు? అనే అనుమానం అందరిలోనూ కలుగుతోంది. అలా అని అనుష్కకేమైనా తెలుగు రాదనుకోవడానికీ లేదాయే. ఇంటర్వ్యూస్‌లో చక్కగా తెలుగులో మాట్లాడుతుంది. మరి ఏంటి ప్రాబ్లమ్. సినిమాల్లో తన సొంత గొంతు వినిపించడానికి.. అంటే, అనుష్క క్లారిటీ ఇచ్చింది ఈ విషయంలో.
తన గొంతు, తన పక్కనున్న వారికే వినిపించదట. అంతేకాదు, చిన్నపిల్లలు మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుందట. అవును స్వీటీ ఎంత క్యూట్‌గా ఉంటుందో ఆమె గొంతు కూడా అంతే స్వీట్ అండ్ క్యూట్‌గా ఉంటుంది. అయితే డబ్బింగ్ చెప్పుకోవడానికి ఆ స్వీట్ వాయిస్ తగదంటోంది ముద్దుగుమ్మ అనుష్క. అన్ని రకాల హావభావాలు తన వాయిస్‌లో సరిగా పలకవంటోంది. తన సినిమాల్లోని కొన్ని డైలాగులు తీసుకుని చాలాసార్లు అనుష్క ట్రై చేసిందట. కానీ వాయిస్‌లో గాంభీర్యం రావడం లేదట. దాంతో విరమించుకుందట.
ఎన్ని విభిన్నమైన పాత్రల్లో నటించి, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నా, తన పాత్రకు తాను డబ్బింగ్ చెప్పుకోలేకపోయానే అనే లోటు అలాగే ఉండిపోతోందట స్వీటీకి. ప్రస్తుతం 'భాగమతి' సినిమాతో రికార్డుల దిశగా పయనిస్తోంది అనుష్క. ఇప్పటికే సంచలన విజయం అందుకున్న 'భాగమతి' ఇంకా సక్సెస్‌ఫుల్‌గా ధియేటర్స్‌లో రన్ అవుతోంది.