మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో తనను కించపరిచేలా సన్నివేశాలు ఉండే అవకాశముందనీ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై లక్ష్మీ పార్వతి అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. స్వర్గీయ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంలో, తెలుగు దేశం పార్టీ స్థాపనలో నాదెండ్ల భాస్కరరావు కీలక పాత్ర పోషించారు.
ఎన్టీఆర్‌ని రాజకీయంగా నాదెండ్ల వెన్నుపోటు పొడిచారనే విమర్శలూ ఉన్నాయి. చరిత్ర ఒక్కొక్కరికీ ఒక్కోలా కనిపించొచ్చు కాక.. కానీ జరిగినది వాస్తవం. ఇంకో పక్క ఎన్టీఆర్ జీవితంలో మరో కోణాన్ని 'లక్ష్మీస్ ఎన్టీఆర్'గా రామ్‌గోపాల్ వర్మ ఆవిష్కరిస్తున్నారు. ఈ సినిమాపై తెలుగుదేశం పార్టీ అభ్యంతరాలు లేవదీస్తోంది. అటు 'ఎన్టీఆర్' పైనా, ఇటు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పైనా వివాదాలు రోజు రోజుకీ ముదిరిపోతున్నాయి.
జనవరి 9న 'ఎన్టీఆర్ - కథానాయకుడు' విడుదలవుతోంది. అయితే ఇందులో రాజకీయ అంశాలు ఉండకపోవచ్చు. ఈ సినిమా తర్వాతే అసలు రాజకీయం మొదలు కాబోతోంది. వాస్తవానికి ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని 'ఎన్టీఆర్ - మహానాయకుడు'లో చూపించనున్నారు. ఈ సినిమాకి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. బాలయ్య స్వీయ నిర్మాణంలో రూపొందుతోన్న సంగతి తెలిసిందే.