అసలు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో ఏముందో ఎవరికీ తెలియదు. ఈలోగానే తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితం చివరి రోజుల్లో చోటు చేసుకున్న సంఘటనల సమాహారం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అని ఆ చిత్ర దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చెబుతున్న సంగతి తెల్సిందే. ఆ సంఘటనలేంటో తెలుగుదేశం పార్టీకే తెలుసు. అందుకే ఆ ఉలికిపాటు అన్నది వర్మ చెబుతున్న మాట.
'లక్ష్మీస్ ఎన్టీఆర్' నుంచి 'వెన్నుపోటు' పాట బయటకు రాగానే తెలుగుదేశం పార్టీ కలవరపాటుకు గురై, రామ్‌గోపాల్ వర్మ మీద కేసులు పెట్టింది. దాంతో వర్మ కూడా లీగల్ ఫైట్ చేయక తప్పడంలేదు. అయితే, ఆధారాల్లేకుండా వర్మని ఇరకాటంలో పెట్టడం సాధ్యం కాదు. ఆ ఆధారాలు కావాలంటే, సినిమా రిలీజ్ అవ్వాల్సి వుంటుంది. సినిమా రిలీజ్ అయ్యాక కాదు, ముందే వర్మని నిలువరించాలనే ప్రయత్నం టీడీపీ నుంచి జరుగుతోంది.
తనకు టీడీపీ ఎమ్మెల్యే లీగల్ నోటీసులు పంపితే, వాటికి కౌంటర్‌గా వర్మ నుంచీ లీగల్ నోటీసులు వెళ్ళాయి. న్యాయ నిపుణులు చెబుతున్నదాన్నిబట్టి, ఏదో ఊహించేసుకుని వర్మ మీద అభ్యంతకర రీతిలో ఆరోపణలు చేస్తున్నందున టీడీపీ ఎమ్మెల్యేనే ఇరకాటంలో పడతారని తెలుస్తోంది. వర్మకి ఇలాంటి కేసులు కొత్త కాదు. రాజకీయాల్లో వున్నవారికైనా అంతే. ఇవన్నీ సినిమాకి ఫ్రీగా పబ్లిసిటీ తెచ్చిపెడ్తాయంతే.