అందాల చందమామ కాజల్ అగర్వాల్ కమర్షియల్ హీరోయిన్‌గా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి సత్తా చాటింది. ఇంతవరకూ గ్లామరస్ పాత్రలతో అలరించిన కాజల్ ఎప్పుడూ ప్రయోగాల జోలికి పోలేదు. కానీ ఈ సారి సరికొత్త ప్రయోగానికి సై అన్నట్లు తెలుస్తోంది. తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో కాజల్ పాత్రకు సంబంధించి, ఫ్రెష్‌గా ఓ అప్‌డేట్ హల్‌చల్ చేస్తోంది.
ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ మాత్రమే కాదట. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుందట. వాస్తవానికి ఈ సినిమా కథ అంతా కాజల్ పాత్ర చుట్టూనే తిరుగుతుందట. సినిమాకి కాజల్ పాత్రే అత్యంత కీలకం కానుందట. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో కూడా కాజల్ పాత్ర చిత్రీకరణకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. 'రాధ'గా ఆ సినిమాలో హీరోతో సమానమైన పాత్ర పోషించిన కాజల్ ఈ సారి 'సీత'గా ఆకట్టుకోనుందట. ఈ సీత పాత్ర పేరుకు తగ్గట్లుగా అంత సౌమ్యమైనదేం కాదనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్.
డబ్బు పిచ్చి ఉన్న అమ్మాయి పాత్రట ఈ సీత పాత్ర. ఈ పాత్రతో తేజ, కాజల్‌లోని మరో యాంగిల్‌ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడట. కాజల్‌ని తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు తేజ. ఇప్పుడు ఆమెలోని సరికొత్త నటిని మరోసారి పరిచయం చేసే క్రెడిట్ కూడా ఆయనే దక్కించుకునేలా ఉన్నాడు. అయితే ఈ వార్తలో నిజమెంతో నిలకడ మీద తెలుస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. త్వరలో కాజల్ 'ప్యారిస్ ప్యారిస్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.