టాలీవుడ్ లో సృజనాత్మక చిత్రాల దర్శకుడిగా క్రిష్ కి పేరుంది. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, కంచె లాంటి చిత్రాలు క్రిష్ అభిరుచికి అద్దం పడతాయి. అయితే కమర్షియల్ గా భారీ హిట్లు ఆయన ఖాతాలో పడలేదు. కాకపోతే.. ఎప్పుడూ తన మార్క్ తప్పలేదు. నిజాయతీ ఉన్న ప్రయత్నాలే చేశాడు. `కొండపొలం` కూడా అలాంటి సినిమానే. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమా చాలామందికి నచ్చింది. కానీ.. థియేటర్లో జనాలే లేరు. కమర్షియల్ అంశాలకు దూరంగా తెరకెక్కించిన సినిమా కాబట్టి, కలక్షన్లు లేవు.
ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 8 కోట్ల బిజినెస్ జరిగింది. అయితే... ఇప్పటి వరకూ ఈ సినిమాకి 3.5 కోట్లే వచ్చాయి. లాంగ్ రన్ లో మరో అరకోటి వచ్చిందనుకుంటే, దాదాపు 4 కోట్లు పోయినట్టే. అంటే సగానికి సగం నష్టం. కాకపోతే... ఈ సినిమా విడుదలకు ముందే బిజినెస్ చేసుకుంది. ఉప్పెన ఎఫెక్ట్ తో వైష్ణవ్ తేజ్ రెండో సినిమాకి మంచి రేట్లు వచ్చాయి. అలా.. నిర్మాతలు సేఫ్ అయిపోయారు. ఈ సినిమా కొన్న బయ్యర్లే సగానికి సగం మునిగిపోయారు. శుక్రవారం ఓ మాదిరి వసూళ్లు తెచ్చుకున్నా, శని, ఆది వారాలు పూర్తిగా డల్ అయిపోయింది. ఈ వారం మరో మూడు కొత్త సినిమాలొస్తున్నాయి. వాటిలో ఏ ఒక్కటి నిలదొక్కుకున్నా... కొండపొలం నిలదొక్కుకోలేదు. పండగ సీజన్ కాబట్టి.. ఈ వీకెండ్ కూడా ఈ సినిమాకి కొన్ని వసూళ్లు రావొచ్చని బయ్యర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు.