సినిమా టికెట్లను ఆన్ లైన్‌లో అమ్మే విషయంలో ప్రభుత్వానికీ ఎగ్జిబీటర్లకు మళ్లీ రగడ మొదలైంది. ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థపై తాజాగా ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవోపై చాలా అభ్యంతరాలు, అనుమానాలు ఉన్నాయి. సినిమా టికెట్లకు ఆన్ లైన్‌లో విక్రయించే విషయంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులూ లేవు. కాకపోతే... అలా ప్రేక్షకుడు చెల్లించిన డబ్బు, తిరిగి థియేటర్ యజమానికి, తద్వారా నిర్మాతలకు ఎప్పుడు వస్తాయా? అనేది పెద్ద ప్రశ్న.
వీటిపై ప్రభుత్వం కూడా సరైన సమాధానం చెప్పడం లేదు. ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తామని ప్రభుత్వం ధీమా ఇవ్వడం లేదు. నెలకోసారి టికెట్ల ద్వారా వసూలైన మొత్తాన్ని ఒకేసారి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే.. ఈ ప్రతిపాదనని ఎగ్జిబీటర్లు, నిర్మాతలతు పెద్ద ఎత్తున వ్యతిరేకించే ప్రమాదం ఉంది. ఈ విధానంపై స్పష్టత రాకుండానే, ఎంవోయూలపై సంతకాలు చేయాలని ప్రభుత్వ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. దీనికి ససేమీరా అంటున్న థియేటర్లకు సీజ్లు వేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని చిలుకూరు పేటలో తాజాగా 5 ఏసీ థియేటర్లకు ఇలానే సీజు వేశారు. సంతకాలు చేయని పక్షంలో అన్ని థియేటర్లనీ ఇలానే మూసేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఫిల్మ్ ఛాంబర్ కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది.
ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థపై సమగ్రమైన చర్చ జరిపి, తమ భయాలను, ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకొంది. బుధ, లేదా గురు వారాల్లో ఛాంబర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి స్పష్టత లేకుండా ఇలాంటి జీవోలను తీసుకురావడం అన్యాయమని, ఎంవోయూలపై సంతకాలు చేసే ప్రసక్తి లేదని, అవసరమైతే థియేటర్లు మూసుకుంటామని థియేటర్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఛాంబర్ సమావేశం తరవాత.. నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎలాంటి అడుగు వేస్తారో చూడాలి.