కోలీవుడ్ లో ఈ మధ్య విడాకుల పరంపర కొనసాగుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకుని, ఏళ్లతరబడి కాపురం చేసి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యాక ఇప్పుడు విడాకులు తీసుకుంటున్నారు. ముందు ధనుష్, ఐశ్వర్య డివోర్స్ తీసుకుంటున్నామని ప్రకటించి అందరికీ షాకిచ్చారు. 20 ఏళ్ళ వీరి పెళ్లి బంధానికి విడాకులతో స్వస్తి చెప్పారు. ఫాన్స్ చాలా బాధపడ్డారు. తరువాత AR రెహ్మాన్ మేనల్లుడు జీవి. ప్రకాష్ కూడా భార్య సైంధవీతో విడిపోయాడు. వీరి 11 ఏళ్ళ వివాహబంధానికి బీటలు వారినట్లు పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. తరవాత జయం రవి, ఆర్తి జంట కూడా 15 ఏళ్ళు కలిసి ఉండి, సడెన్ గా విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇలా వరుసగా కోలీవుడ్ స్టార్ కపుల్స్ విడాకులు తీసుకుంటూ ఫాన్స్ కి షాకిస్తున్నారు. ఇప్పుడు మరొక స్టార్ కపుల్ డివోర్స్ తీసుకుంటున్నట్లు అనౌన్స్ చేశారు. వారే ఏఆర్. రెహమాన్, సైరా భాను. తనభర్త నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు సైరాభాను ప్రకటించారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. రెహమాన్ కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి, తల్లికి చెప్పగా సైరాను చూసి పెళ్లి చేసినట్లు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రెహమాన్ సైరా భానుని1995లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఖతీజా, రహీమా, అనే ఇద్దరు అమ్మాయిలు, అమీన్ రెహమాన్ అనే కొడుకు ఉన్నారు. ఇద్దరి మధ్య అంతులేని ప్రేమ ఉన్నా, కొన్ని మనస్పర్థలు వచ్చాయని, అవి అంతకంతకీ పెరిగి మా బంధాన్ని విచ్చిన్నం చేశాయని సైరా తెలిపారు.
29ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికి ఏఆర్ రెహమాన్ నుంచి తాను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపినట్లు సైరా లాయర్ వందనా షా అధికారిక ప్రకటన చేశారు. అభిప్రాయ భేదాలతో కలిసి ఉండి గొడవలు పడేకంటే విడిపోవడమే సరైన నిర్ణయం అని వారు భావించినట్లు తెలిపారు సైరా లాయర్ వందనా షా. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తమ ప్రైవసీని గౌరవించాలని, ప్రతి ఒక్కరూ తమ పరిస్థితిని అర్థం చేసుకుని కోపరేట్ చేయాలనీ రెహమాన్ కోరినట్టు తెలుస్తోంది.