ఏ స్టార్ హీరో సినిమా విడుదల అయినా.. ముందు వసూళ్ల గురించీ, ఆ తరవాత రికార్డుల గురించీ మాట్లాడుకుంటారు. ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయడం వల్ల - సాధారణంగానే సినిమా టాక్ ఎలా ఉన్నా, మొదటి రోజే రికార్డు వసూళ్ల గురించి మాట్లాడుకునే అవకాశం దక్కుతోంది. 'అరవింద సమేత వీర రాఘవ' కూడా ఇప్పుడు రికార్డుల మోత మోగిస్తోంది. ఓవర్సీస్‌లో తొలిరోజే వన్ మిలియన్ డాలర్ల మార్క్ అందుకొంది.
ఈ రికార్డు చూసి ఎన్టీఆర్ అభిమానులు మురిసిపోతున్నారు. అయితే.. పవన్ కల్యాణ్‌ఫ్యాన్స్ మాత్రం 'మా సినిమా తొలి రోజే 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది కదా' అని 'అజ్ఞాతవాసి' వసూళ్లని గుర్తు చేస్తున్నారు. 'అజ్ఞాతవాసి' తొలిరోజు ఓవర్సీస్ లో దుమ్ము దులిపేసింది. పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌ని ఉన్న క్రేజ్ దృష్ట్యా... తొలిరోజు ఓవర్సీస్‌లో ఏకంగా 1.5 మిలియన్ డాలర్లు అందుకుంది. ఇదో అరుదైన రికార్డు.
అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరుకోవడం లేదు. కౌంటర్లు ఇవ్వడం మొదలెట్టారు. 'అజ్ఞాతవాసి 550 లొకేషన్లలో విడుదలైంది. అరవింద 192 లొకేషన్లలోనే ఈ స్థాయి వసూళ్లు తెచ్చుకుంది. కాబట్టి మా సినిమానే గొప్ప' అంటూ ట్రోల్స్ చేసుకుంటున్నారు. తాజా లెక్కల వల్ల అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ - ఇటు పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మాటల యుద్ధం చేసుకునే పరిస్థితులొచ్చాయి.అయితే ఈ ఇద్దరు అభిమానులు ఓ విషయం గుర్తుంచుకోవాలి.
'అరవింద సమేత' ఓపెనింగ్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా జరిగింది. ఈ సినిమా హిట్‌కి పవన్ ఆశీర్వాద బలం ఓ కారణం అని ఇద్దరు అభిమానులు అనుకుంటే గనుక... అసలు ఎక్కువ, తక్కువ అనే డిబేటే జరగదు కదా??