'ఇంతవరకు నా సినిమా కెరీర్‌లో ఎప్పుడూ తండ్రికి తల కొరివి పెట్టే సన్నివేశంలో నటించాల్సి రాలేదు.. కానీ, ఈ సినిమా కోసం అలా చేయాల్సి వచ్చింది.. దురదృష్టవశాత్తూ నేను ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నా తండ్రిని కోల్పోవాల్సి వచ్చింది..' అంటూ కన్నీరుమున్నీరయ్యాడు 'అరవింద సమేత' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్.
పైగా, ఈ సినిమాలో 'పెనివిటీ..' అంటూ సాగే ఓ పాట వుంది. అదొక్కటే కాదు, 'రుధిరం..' అనే మరో సిట్యుయేషనల్ సాంగ్ కూడా వుంది. ఈ రెండు సాంగ్స్, సినిమాలోని 'ఎమోషనల్ కంటెంట్' నేపథ్యంలో రూపొందినవే. దాంతో, 'అరవింద సమేత'లో హీరో, తన తండ్రిని కోల్పోయే సీన్ ఎంత ఎమోషనల్‌గా వుండబోతోందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. సాధారణ సన్నివేశాన్ని సైతం, తనదైన మ్యాజిక్‌తో అద్భుతంగా మలచే త్రివిక్రమ్, ఈ ఎమోషనల్ సీన్‌ని అత్యద్భుతంగా తెరకెక్కించాడట. సీన్ చూస్తే ఎవరైనా కంటతడిపెట్టాల్సిందేనట.
ఇన్‌సైడ్ సోర్సెస్ అందిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సీన్ సినిమాకే హైలైట్ అవుతుందనీ, సినిమాలో అత్యంత కీలకమైన 'టర్న్' ఈ సీన్‌తోనే వస్తుందనీ తెలుస్తోంది. యంగ్ టైగర్ నట విశ్వరూపాన్ని చూపించే ఈ సీన్ గురించి చిత్ర యూనిట్ కథలు కథలుగా చెబుతుండడం గమనార్హం. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న 'అరవింద సమేత', దసరా సెలవుల్లో కాసుల పంట పండించనుందని ఇప్పటికే ట్రేడ్ పండితులు ఖచ్చితమైన లెక్కలతో వున్నాయి.
100 కోట్ల క్లబ్‌లో చేరడమే లక్ష్యంగా దూసుకొస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'అరవింద సమేత' ఎలాంటి సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుందో వేచి చూడాల్సిందే.