స్టార్ హీరో సినిమా వస్తే.. ఆ హంగామానే వేరు. తొలిరోజే రికార్డుల గురించి మాట్లాడుకునే అవకాశం దొరుకుతుంది. హిట్ టాక్ వస్తే.. థియేటర్లన్నీ కళకళలాడిపోతుంటాయి. 'అరవింద సమేత వీర రాఘవ' విషయంలోనూ ఇదే జరిగింది. గురువారం విడుదలైన ఈ చిత్రానికి రివ్యూలు బాగానే వచ్చాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కైతే ఈ సినిమా బాగా నచ్చేసింది. దసరా సీజన్ కావడం, బాక్సాఫీసు బరిలో మరో సినిమా లేకపోవడం 'అరవింద'కు బాగా కలిసొచ్చాయి. ఓవర్సీస్‌లో దుమ్ము దులిపేసిన అరవింద.. తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటింది. తొలిరోజు రూ.26 కోట్ల వరకూ సంపాదించింది.
నైజాంలోనే దాదాపు రూ.5.5 కోట్లు తెచ్చుకున్న 'అరవింద'.. సీడెడ్‌లో రూ.6.5 కోట్లు సాధించింది. ఈస్ట్, వెస్ట్ కలిపి దాదాపు రూ.4.75 కోట్లు తెచ్చుకుంది. అన్నిచోట్లా ఓపెనింగ్స్ అదిరాయి. కొన్ని చోట్ల ఖైది నెం.150, అజ్ఞాతవాసి పేరుమీద ఉన్న తొలి రోజు రికార్డులని బద్దలు కొట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా రూ.90 కోట్లకు అమ్ముడుపోయింది 'అరవింద సమేత'. బయ్యర్లు బయటపడాలంటే దాదాపు రూ.140 కోట్ల గ్రాస్ వరకూ సాధించాలి. దసరా సీజన్ నడుస్తోంది కాబట్టి.. హిట్ టాక్ తెచ్చుకుంది కాబట్టి.. 'అరవింద' ఆ మైలు రాయిని సులభంగానే చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి