దసరా సెలవులు 'అరవింద సమేత' సినిమాకి భలేగా కలిసొచ్చేలా వున్నాయి. సినిమాకి ఫస్ట్ డే హిట్ టాక్ రావడంతో, వసూళ్ళ ప్రభంజనం కొనసాగుతోంది. దానికి దసరా సెలవులు కలిసొచ్చి, వసూళ్ళ పండగ కనిపిస్తోంది అన్ని చోట్లా.
ముఖ్యంగా నైజాం, రాయలసీమల్లో 'అరవింద సమేత' థియేటర్లు ప్రేక్షక జనంతో పోటెత్తుతున్నాయ్. రెండు రోజులకి ఏకంగా 34.59 కోట్లు కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే వసూళ్ళు వచ్చాయంటే 'అరవింద సమేత' ప్రభంజనమెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నేడు, రేపు వీకెండ్ కావడంతో వసూళ్ళు మరింతగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నాన్ బాహులి రికార్డ్‌ని 'అరవింద సమేత' తెలుగు స్టేట్స్‌లో తిరగరాసింది.
వీకెండ్ ముగిసేసరికి, 'అరవింద సమేత' సరికొత్త రికార్డులు తెలుగు స్టేట్స్‌లో సృష్టిస్తుందని యంగ్ టైగర్ అభిమానులు ఉత్సాహంగా చెబుతున్నారు. ఓవర్సీస్‌లోనూ 'అరవింద సమేత' వసూళ్ళ ప్రభంజనం కొనసాగుతోంది. విజయదశమి నాటికే 'అరవింద సమేత' సినిమా షేర్స్ పరంగా 100 కోట్లు దాటేయవచ్చునని ఓ అంచనా. 2018లో రెండు సినిమాలు 100 కోట్ల క్లబ్‌లోకి చేరాయి. ఒకటి మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన 'రంగస్థలం' కాగా, మరొకటి సూపర్ స్టార్ మహేష్‌బాబు నటించిన 'భరత్ అనే నేను'. 'అరవింద సమేత' ఫస్ట్ డే టాక్ తర్వాత, 100 కోట్ల క్లబ్‌లోకి చేరడం అంత తేలిక కాదని కొందరు అభిప్రాయ పడ్డారు.
అయితే, రెండో రోజు వసూళ్ళ తర్వాత 100 కోట్ల క్లబ్‌లోకి చేరుకోవడం జస్ట్ కేక్ వాక్ అని ట్రేడ్ పండితులు తేల్చేస్తున్నారు. నేడు, రేపు 'అరవింద సమేత' వసూళ్ళ కుమ్ముడుని బట్టి, 'అరవింద సమేత' ఎంత తొందరగా 100 కోట్ల క్లబ్‌లోకి చేరుతుందన్నదానిపై ఓ స్పష్టత వస్తుంది.