సినిమా తీయడం ఒక యెత్తయితే - విడుదలకు ముందే లాభాలు సంపాదించి పెట్టడం మరో ఎత్తు. స్టార్ డమ్ కి అర్థం అదే. ఓ సినిమా విడుదలకు ముందే లాభాల్ని చవిచూసిందంటే ఆ సినిమాపై బయ్యర్లకు, జనాలకు అంత నమ్మకం ఉందన్నమాట. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోపై సినీ వర్గాలకు ఎనలేని నమ్మకం కుదిరింది. అందుకే 'అరవింద సమేత'కు లాభాలొచ్చి పడ్డాయి.
రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడే... 'అరవింద సమేత వీర రాఘవ' హక్కులన్నీ అమ్మేశారు. అన్ని ఏరియాలను కలుపుకుంటే దాదాపుగా రూ.90 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. పెట్టబడి అంతా ఈ రూపంలో తిరిగొచ్చేసింది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో మరో రూ.40 కోట్లు ముట్టాయని తెలుస్తోంది.
ఇదంతా అరవిందకు లాభాలుగానే పరిగణించాలి. 'అజ్ఞాతవాసి'తో హారిక హాసిని క్రియేషన్స్ సంస్థకు భారీ నష్టాలొచ్చాయి. బయ్యర్లకు రూ.25 కోట్లు తిరిగి ఇచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అంతకు అంత `అరవింద`తో సాధించేసింది. ఈ సినిమాతో బయ్యర్లు గట్టెక్కాలంటే.. మొత్తానికి రూ.125 కోట్లు రాబట్టాలి. అది జరిగితే గానీ 'అరవింద' కొన్నందుకు వాళ్లు సేఫ్ జోన్‌లోకి వెళ్లరు.
'అజ్ఞాతవాసి'లా 'అరవింద' కూడా హ్యాండిచ్చిందంటే, ఈ రూ.40 కోట్లు మళ్లీ పంచాల్సిందే.