నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం 'అశ్వత్ధామ' టీజర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ఏడాది సమంత నటించిన 'ఓ బేబీ' చిత్రంలో నాగశౌర్య కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌లో రూపొందుతోన్న 'అశ్వత్థామ' చిత్ర ట్రైలర్‌ని సమంత చేతుల మీదుగా రిలీజ్ చేయించాడు నాగశౌర్య. కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగశౌర్య డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు.
పక్కా మెచ్యూర్డ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్నీ అదే మోడ్‌లో కట్ చేశారు. పవర్ఫుల్ డైలాగులు, ఫుల్ ఆఫ్ యాక్షన్‌తో టీజర్‌ని నింపేశారు. ఇక టీజర్ విషయానికి వస్తే, 'గమ్యం తెలియని ఓ యుద్ధం.. ఆ యుద్ధంలో గెలవాలంటే ఆరడుగుల నారాయణాస్త్రం కావాలి. ఒక అశ్వత్ధాముడు రావాలి..' అనే పవర్ఫుల్ డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అయ్యింది. తర్వాత నాగశౌర్య యాక్షన్.. టీజర్ మధ్యలో హీరోయిన్ మెహ్రీన్‌కీ కొన్ని సెకన్లు చోటు దక్కింది. ఇంతవరకూ హీరోగా మాత్రమే తెలిసిన నాగశౌర్య ఈ సినిమాతో రచయితగా మారి, కథ అందించడం విశేషం. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ కథను సిద్ధం చేశాడు నాగశౌర్య. జనవరి 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.