జాతి రత్నాలు.... చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకొంది. కేవలం 4 కోట్లతో ఈ సినిమా తీస్తే... ఏకంగా నలభై కోట్లొచ్చాయి. కొవిడ్ తరవాత విడుదలైన సినిమా ఇది. జనం బ్రహ్మరథం పట్టారు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి, విశ్వరూపం సృష్టించింది. ఈ సినిమాని అశ్వనీదత్ తెరకెక్కించారు. అయితే క్రెడిట్ మొత్తం నాగ అశ్విన్‌కి దక్కుతుంది.
ఈ సినిమా వెనుక ఉన్న పెద్ద హ్యాండ్ నాగ అశ్విన్ దే. దర్శకుడు అనుదీప్ పనితనంపై నాగ అశ్విన్‌కి అపారమైన నమ్మకం. ఆ నమ్మకంతోనే.. నాగ అశ్విన్ అనుదీప్ ని అశ్వనీదత్ దగ్గరకు తీసుకెళ్లారు. అసలు కామెడీ కథలంటే పెద్దగా ఇష్టపడని అశ్వనీదత్. ఈ కథకు వినకుండా సినిమాని ఓకే చేశారు. కేవలం 4 కోట్లతో సినిమా పూర్తయ్యింది.
సినిమా విడుదలకు ముందు దీన్ని ఓటీటీకి ఇచ్చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. అమేజాన్ ప్రైమ్ ఈ సినిమాని రూ.22 కోట్లకు కొనడానికి ముందుకొచ్చింది. అంటే.. ఆ సినిమాని అమేజాన్‌కి అమ్మేస్తే 18 కోట్లు వచ్చేవన్నమాట. కానీ నాగ అశ్విన్ ఒప్పుకోలేదు. ''ఈ సినిమాని థియేటర్లో విడుదల చేస్తే హిట్టవుతుంది. ఓటీటీకి ఇస్తే ఫ్లాప్ అవుతుంది. నన్ను నమ్మండి'' అని అశ్వనీదత్‌కి ధైర్యం చెప్పాడట. అల్లుడిపై నమ్మకంతో.. ఈసినిమాని థియేటర్లలోనే విడుదల చేశారు. చివరికి 40 కోట్లొచ్చాయి. ఓటీటీకి ఇస్తే.. 18 కోట్ల లాభం దక్కేది. థియేటర్లో విడుదల చేశారు కాబట్టి లాభం డబుల్ అయ్యింది. ఈ విషయాన్ని అశ్వనీదత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.