ఇది వరకు ఉద్యమం నేపథ్యంలో చాలా సినిమాలొచ్చేవి. నక్సల్ ఉద్యమాన్ని ప్రధాన వస్తువుగా చేసుకొని చాలామంది సినిమాలు చేశారు. అందులో హిట్లు కొట్టారు. అడవిలో అన్న, చీమలదండు, ఎర్రసైన్యం, ఎన్‌కౌంటర్.. ఇవన్నీ ఇలాంటి కథలే. ఆర్.నారాయణ మూర్తి `అన్న` సినిమాలకు మార్గం చూపిస్తే, ఆ తరవాత పెద్ద హీరోలు కూడా ఈ తరహా పాత్రలు ఎంచుకొని హిట్లు కొట్టారు. దాసరి ఆల్ టైమ్ సూపర్ హిట్ `ఒసేయ్ రాములమ్మా` కూడా నక్సల్ నేపథ్యంలో సాగే కథే. ఒకప్పుడు నక్సలైట్ కథ... హిట్ ఫార్ములా. అయితే రోజులు మారాయి. నక్సల్ కథలకు కాలం చెల్లిపోయింది. ఈమధ్య వచ్చిన సినిమాలు, వాటి ఫలితాలూ చూస్తే ఈ విషయం అర్థమైపోతోంది.
చిరంజీవి నటించిన చిత్రం `ఆచార్య`. ఇందులో చిరు, చరణ్‌లు ఇద్దరూ నక్సలైట్లుగా కనిపించారు. ఈ తరహా పాత్ర చేయడం ఇద్దరికీ ఇదే తొలిసారి. అయితే.. బాక్సాఫీసు దగ్గర ఆ సినిమా బోల్తా కొట్టింది. రానా విరాటపర్వం కూడా నక్సల్ నేపథ్యంలో సాగే కథే. ఇది కూడా ఫ్లాప్ అయ్యింది. ఇటీవల రాంగోపాల్ వర్మ...`కొండా` అనే సినిమాని రూపొందించారు. అందులోనూ నక్సల్ నేపథ్యం ఉంది. ఈ సినిమా కూడా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఒకే సీజన్‌లో వచ్చిన మూడు నక్సల్ సినిమాలూ బోల్తా కొట్టడం చూస్తుంటే.. ఈ టైపు కథలకు కాలం చెల్లిపోయినట్టే అనిపిస్తోంది. నక్సల్ ఉద్యమం ఇప్పుడు లేదు. వాళ్ల గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహం, ఆసక్తి ఈతరం ప్రేక్షకులలో లేవు. వాళ్లకు నక్సల్ ఉద్యమం గురించి, అభ్యుదయాల గురించీ తెలీవు. అందుకే.. ఈ తరహా కథలు చూడడానికి ఇష్టపడడం లేదు. తెలుగు సినిమాకి మహారాజా పోషకులు యువతరమే. వాళ్లెప్పుడో నక్సల్ కథలకు డిస్ కనెక్ట్ అయిపోయారు. అలాంటప్పుడు ఆ నేపథ్యంలో సినిమాలు వస్తే ఎందుకు చూస్తారు? అందుకే.. ఈ మూడు సినిమాలూ ఫ్లాప్ అయ్యాయి. ఇకమీదట నక్సల్ కథతో సినిమా అంటే.. దర్శక నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిందే.