`ఉయ్యాల జంపాలా` సినిమాతో తెలుగు వాళ్లని ఆకట్టుకుంది అవికా గోర్. ఆ అందం, అమాయకత్వం... అందిరినీ విపరీతంగా ఆకర్షించాయి. `ఉయ్యాల జంపాలా` హిట్టవ్వడంతో ఆమెకు మరిన్ని అవకాశాలొచ్చాయి. అయితే వాటిని నిలబెట్టుకోలేకపోయింది అవికా. పైగా... బాగా ఒళ్లు చేసి, హీరోయిన్ వేషాలకు క్రమంగా దూరమైంది. అయితే ఇప్పుడు అవికాని చూస్తే మాత్రం షాక్ తింటారు. అంతలా నాజూగ్గా మారింది. దాదాపు 15 కిలోలు తగ్గి... అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.
అయితే ఈ వర్కవుట్ల వెనుక, సన్నగా మారడం వెనుక... చాలా బాధని దిగమింగుకుంది అవికా. ``నేను భోజన ప్రియురాలిని. నోటిని అదుపులో ఉంచుకునేదాన్ని కాదు. ఇష్టమైనవన్నీ తినేదాన్ని. వర్కవుట్లు చేసేదాన్ని కాదు. దాంతో బాగా లావుగా తయారయ్యా. పొట్ట వచ్చేసింది. నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడల్లా ఏడుపు వచ్చేసేది. ఏంటి ఇలా తయారయ్యా.. అని ఏడ్చేసేదాన్ని. నన్ను చూసి చాలామంది రకరకాల మాటలు అన్నారు. అవన్నీ నాకు తెలుసు. అందుకే.. బరువు తగ్గాలని నిర్ణయించుకున్నా. కఠోర శ్రమ తరవాత 15 కిలోలు తగ్గా`` అని చెప్పుకొచ్చింది అవికా.
ఇప్పుడు అవికాని చూస్తే.. తప్పకుండా మళ్లీ టాలీవుడ్‌లో అవకాశాలు కొల్లగొట్టేలానే కనిపిస్తోంది. మనకు అసలే కథానాయికల కొరత. అవిక లాంటి వాళ్లు సై అంటే.. హీరోయిన్ పోస్టులు చాలా వరకూ భర్తీ అవుతాయి. మరి.... అవికాకి మున్ముందు ఎలాంటి అవకాశాలు వరిస్తాయో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.