‘నేను కమెడియన్‌ని.. ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం నా పని.. ఈ విషయంలో ఎవరేమనుకున్నా డోన్ట్ కేర్..’ అంటూ పదే పదే బిగ్‌హౌస్‌లో అరిచి గీ పెట్టేస్తున్నాడు జబర్దస్త్ అవినాష్ అలియాస్ ముక్కు అవినాష్. కెప్టెన్సీ టాస్క్ గెలిచి తాను ఉత్త కమెడియన్‌ని కాదనీ, తాను కూడా పవర్‌ఫుల్ కంటెస్టెంట్‌ననీ నిరూపించుకున్నాడు ఈ కమెడియన్. కానీ, ఏం లాభం.? ఎంతలా గొంతు చించుకుంటున్నా, ‘బాబూ, పక్కకు పోయి ఆడుకో..’ అన్నట్లుగా మిగతా కంటెస్టెంట్స్, అవినాష్‌ని లైట్ తీసుకుంటున్నారు.
మోనాల్ గజ్జర్, సుజాత, అబిజీత్.. ఇలా దాదాపుగా హౌస్‌లో ప్రతి కంటెస్టెంట్ ఏదో ఒక సందర్భంలో అవినాష్‌ని, ‘నా మీద కామెడీ చేయొద్దు..’ అని హుకూం జారీ చేసినవారే. కానీ, అవినాష్ మాత్రం కామెడీ చేస్తూనే వుండాలని బిగ్‌బాస్‌తోపాటు, హోస్ట్ నాగార్జున కూడా చెబుతూ వస్తున్న విషయం విదితమే. కమెడియన్‌కి ఆ కామెడీనే ఇప్పుడు శతృవుగా మారుతోందా.? అంటే, హౌస్‌మేట్స్‌కి సంబంధించినంతవరకు అదే నిజమని అనుకోవాలేమో. కానీ, బయట పరిస్థితి ఇంకోలా వుంది.
అవినాష్ తప్ప, ఈసారి బిగ్‌హౌస్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా సరైన కంటెస్టెంట్ లేరన్న అభిప్రాయం చాలామందిలో వుంది. కాస్సేపు హ్యాపీగా నవ్వుకోవడానికి అవినాష్ అనే ‘ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్’ బిగ్‌బాస్ వ్యూయర్స్‌కి దొరుకుతోంది ఈ షో ద్వారా. అదే అతన్ని ఇన్ని రోజులపాటు హౌస్‌లో వుంచింది. అయితే, కూరలో కరివేపాకులా ఏ క్షణాన అయినా అవినాష్‌ని హౌస్ నుంచి పంపేయవచ్చన్న ప్రచారమూ జరుగుతుండడం గమనార్హం.