ఒక హీరో నటించిన రెండు మూడు సినిమాలు వరుసగా సూపర్ హిట్టవ్వగానే.. అతడ్ని సూపర్ స్టార్ అని పిలవడం మొదలు పెట్టడం సర్వ సాధారణం. కానీ బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన సినిమాలు వరుసగా హిట్టవుతూనే ఉన్నాయి. అతి కష్టం మీద అతడ్ని 'హిట్ మిషన్' అని అంటున్నారు కానీ.. సూపర్ స్టార్ అని మాత్రం పొరపాటున కూడా అనడం లేదు అక్కడి మీడియా.
ఇటీవలకాలంలో ఏ బాలీవుడ్ హీరోకు లేనన్ని హిట్లు ఆయుష్మాన్ ఖురానాకు ఉన్నాయి. మధ్యలో ఒకటి రెండు సినిమాలు మాత్రమే ఓ మోస్తరు విజయాలతో సరి పెట్టుకున్నాయి. మిగతావన్నీ సూపర్ డూపర్ హిట్సే. ముఖ్యంగా కథల ఎంపికలో అతను చూపిస్తున్న వైవిధ్యం, దైర్యం చూసి బాలీవుడ్ హీరోలే కాదు.. మిగతా భాషల హీరోలు సైతం కుళ్ళుకుంటున్నారు.
అయినాసరే అతడ్ని సూపర్ స్టార్ అని పిలవడానికి బాలీవుడ్ మీడియాకి మనసు రావడం లేదు. విక్కీ డోనర్ మొదలుకొని.. బరైలీ కి బర్ఫీ, శుభ మంగళ్ సావధాన్, అందాదున్, బడాయిహో, ఆర్టికల్ 15, డ్రీమ్ గర్ల్ చిత్రాలతో పాటు 'బాలా' కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాల బడ్జట్ తో అవి సాధించిన కలెక్షన్స్ కంపేర్ చేస్తే.. ఇవన్నీ బాహుబలి స్థాయి విజయాలుగా చెప్పవచ్చు. ఎందుకంటే.. ఆయుష్మాన్ సినిమాలన్నీ.. మన తెలుగులో నిఖిల్, నాగశౌర్య వంటి హీరోలతో తీసే సినిమాలకు ఎంత బడ్జెట్ అవుతుందో.. అంతకంటే తక్కువ ఖర్చు అవుతుంది. వసూళ్లు మాత్రం సునాయాసంగా వంద కోట్లు దాటి పోతున్నాయి. శాటిలైట్, డిజిటల్, ఓవర్ సీస్ రైట్స్ రూపంలో వచ్చే ఆదాయం ఇందుకు అదనం. మరి ఇప్పటికైనా అతన్ని 'సూపర్ స్టార్' గా బాలీవుడ్ మీడియా గుర్తిస్తుంధో లేదో చూడాలి!!