ఎటు చూసినా 'బాహుబలి' రికార్డులే. ఒక్కటేమిటి అన్ని రికార్డులూ బాహుబలివే. రోజుకో కొత్త రికార్డుతో దద్దరిల్లిపోయింది. టాలీవుడ్‌లోనే కాకుండా, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ ఒక్క చోటా వదలకుండా 'బాహుబలి' సినిమా రికార్డులకు కేంద్రబిందువయ్యింది. అయితే కొంత కాలంగా 'బాహుబలి' రికార్డులకి బ్రేకులు పడ్డాయి. 'దంగల్' సినిమా చైనాలో విడుదలయ్యాక, 'బాహుబలి' రికార్డులు స్లో అయ్యాయని చెప్పవచ్చు. 'దంగల్' సినిమా చైనా వసూళ్లు కలుపుకుని 1900 కోట్లు కొల్లగొట్టింది. ఇంకా 2000 కోట్ల మార్కెట్‌ని 'దంగల్' టచ్ చేయలేకపోయింది కానీ 'బాహుబలి' సినిమాకి గట్టి పోటీగా నిలిచింది 'దంగల్' సినిమా. అయితే ఇప్పుడు మళ్లీ 'బాహుబలి' సినిమా రికార్డులు సృష్టించేందుకు రెడీ అవుతోంది. ఇందుకు కారణం 'బాహుబలి' చైనాలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఒక్క చైనాలోనే కాదు, చైనాతో సహా పలు దేశాల్లో ఈ సినిమాని విడుదల చేసేందుకు రాజమౌళి అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఇదే జరిగితే 'దంగల్' రికార్డుల్ని మళ్లీ 'బాహుబలి' కొల్లగొట్టేయడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇంతవరకూ అన్ని వసూళ్లు కలిపి 'బాహుబలి' దాదాపుగా 1700 కోట్ల వద్ద నిలిచింది. చైనాలో రిలీజ్ అయితే ఆ లెక్క ఈజీగా 2000 కోట్లని దాటేస్తుంది. చైనాలో మొత్తం 4000 ధియేటర్లలో 'బాహుబలి' సినిమాని విడుదల చేయనున్నారట. ప్రబాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.