గతేడాది ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బాహుబలి ది కన్‌క్లూజన్' ఓవరాల్‌గా ఎన్ని రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిందే. తెలుగుతో పాటు, ఇతర భాషల్లో కూడా ఈ సినిమా హవా చూపింది. వసూళ్ల సునామీ సృష్టించింది. హిందీలో స్ట్రెయిట్ మూవీని మించిన భారీ వసూళ్లు 'బాహుబలి' హిందీ వెర్షన్ అందుకోవడంతో బాలీవుడ్ బాక్సాఫీస్ జీర్ణించుకోలేకపోయింది కూడా. ఇకపోతే లేటెస్ట్‌గా ఈ సినిమాని చైనాలో విడుదల చేశారు. చైనాలో కూడా వసూళ్ల ప్రభంజనం అదే రేంజ్‌లో ఉంది.
'బాహుబలి ది బిగినింగ్' సినిమా చైనాలో ఫెయిలైంది. బాహుబలి తొలి పార్ట్, ప్రదర్శితమైన మొత్తం రోజుల్లో వచ్చిన టోటల్ అమౌంట్‌ని 'బాహుబలి 2' ఒక్కరోజు పూర్తి కాకుండానే కొల్లగొట్టేసింది. ఇదో సరికొత్త రికార్డ్‌గా చెప్పాలి. ఒక్కరోజు పూర్తి కాకుండానే ఈ సినిమా 1.18 మిలియన్స్ వసూళ్లు కొల్లగొట్టడంతో 'బాహుబలి' టీమ్ ఆనందానికి అవధుల్లేవు. తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి చాటి చెప్పింది 'బాహుబలి 2' చైనాలో సాధించిన ఈ తాజా వసూళ్లతో.
హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఘట్టాలు ఈ సినిమా ఇంతటి ఘన విజయాన్ని సాధించేందుకు ఉపయోగపడ్డాయి. యాక్షన్ చిత్రాలకు చైనాలో మంచి ఆదరణ దక్కుతుంది. ఆ కోవలోనే మన తెలుగు సినిమా 'బాహుబలి'కి ఈ స్థాయిలో ఆదరణ దక్కుతోందిప్పుడు. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రబాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్య పాత్రల్లో నటించారు.