రామ్‌చరణ్ పుట్టిన రోజున `అల్లూరి` టీజర్‌ని విడుదల చేసి, మెగా ఫ్యాన్స్ ని సంతోష పెట్టాడు రాజమౌళి. చరణ్ విజువల్స్, ఎన్టీఆర్ వాయిస్ - ఈ రెండింటినీ మేళవించిన తీరు, సినీ అభిమానులందరికీ నచ్చింది. సరిగ్గా ఇలాంటి హంగామానే ఎన్టీఆర్ పుట్టిన రోజునా చూడాలని ఆశిస్తున్నారంతా. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా `భీమ్`కి సంబంధించిన టీజర్ వస్తుందన్నది అందరి ఆశ. ఆ టీజర్‌లో ఎన్టీఆర్, విజువల్స్‌కి, చరణ్ వాయిస్ తోడవుతుందన్నది అందరి అంచనా. అది నిజమే అని రాజమౌళి చెప్పేశారు. చరణ్ టీజర్‌కి ఎన్టీఆర్ ఎలా గొంతు అందించాడో, ఎన్టీఆర్ టీజర్‌కి చరణ్ గొంతు అలానే వినిపిస్తుందని క్లారిటీ ఇచ్చేశాడు. కానీ... అనుకున్న సమయానికి ఎన్టీఆర్ విజువల్స్ పూర్తవుతాయా, లేదా? అనే విషయంలో మాత్రం రాజమౌళికి సందేహాలున్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ టీజర్‌కి సంబంధించి కొన్ని విజువల్స్ ఇంకా తెరకెక్కించలేదట. లాక్ డౌన్ ఎత్తేసి, షూటింగులకు అనుమతులు ఇస్తే, అప్పుడు వాటిని తెరకెక్కిస్తారు. మే 7 వరకూ లాక్ డౌన్ నిబంధనలు ఉంటాయి. ఆ తరవాత పరిస్థితి ఇప్పుడే చెప్పలేం. ఏమాత్రం అవకాశం ఉన్నా, ఎన్టీఆర్ పుట్టిన రోజున టీజర్‌ని విడుదల చేయాలనే చిత్రబృందం భావిస్తోంది.
ఒకవేళ లాక్ డౌన్ ఎత్తేయకపోతే, టీజర్ షూట్ చేయడం కుదరదు. అప్పటికి ఉన్న విజువల్స్ తోనే సరిపెట్టుకుంటారా, లేదంటే.. ఎన్టీఆర్ పుట్టిన రోజున టీజర్ లేకుండానే గడిపేస్తారా అనేది పెద్ద డౌటు. అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని ముందే ప్రిపేర్ చేసే పనిలో పడ్డాడు రాజమౌళి. ''ఎన్టీఆర్ టీజర్‌కి చరణ్ గొంతు ఇవ్వడం సమస్య కాదు. కానీ, భీమ్‌కి సంబంధించి ఇంకొన్ని విజువల్స్ తీయాల్సివుంది. లాక్ డౌన్ తరవాత పరిస్థితులేంటన్నదాన్ని బట్టి చిత్రీకరణ ఆధారపడి ఉంటుంది'' అని ముందే ఓ హింట్ ఇచ్చేశాడు రాజమౌళి. సో.. ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుక డౌటే అన్నమాట.