బాలకృష్ణ డైలాగ్ చెప్పినా - చెంపదెబ్బ కొట్టినా... అభిమానులకు ఆనందమే. పాట పాడితే... పూనకాలు వచ్చేస్తాయి. అందులో శ్రుతి, లయ ఉన్నా - లేకున్నా, బాలయ్య జోష్ మాత్రం కట్టి పడేస్తుంది. `మామా ఏక్ పెగ్ లా..` అంటూ పైసా వసూల్ లో బాలకృష్ణ చేసిన సందడి... ఇప్పుడే మర్చిపోలేం. తన తండ్రి ఎన్టీఆర్ ని గుర్తు చేసుకుంటూ.. శివ శంకరీ... అంటూ మరో గీతాన్ని ఆలపించాడు. ఈమధ్యే... ఎన్టీఆర్ 99వ జయంతి సందర్భంగా శ్రీరామదండకం వినిపించాడు. ఈ ప్రయత్నాలన్నీ అభిమానులకు నచ్చేశాయి.
అందుకే ఇప్పుడు మరో పాటని అలపించబోతున్నాడట. అది కూడా ఎన్టీఆర్ కోసమే. ఆ పాట ఏమిటన్నది తేలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. అన్నట్టు ప్రస్తుతం `అఖండ`లో నటించబోతున్నాడు బాలయ్య. ఇందులో అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడు. అందుకోసం కొన్ని సంస్క్రృత శ్లోకాల్ని బాలయ్య వినిపించబోతున్నాడట. ఇవన్నీ బాలయ్య గొంతులోనే ఉంటాయని టాక్. మొత్తానికి గాయకుడిగా తనని తాను సానబెట్టుకుంటున్నాడన్నమాట.