నటసింహ నందమూరి బాలకృష్ణ సుదీర్ఘ కెరీర్లో ఓ మరపురాని చిత్రం 'ఆదిత్య 369'. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా అప్పట్లో ప్రేక్షకాదరణతో పాటుగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. బాలయ్య తన 100వ చిత్రం చేయకముందు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. ఎందుకో మరి తెలియదు కానీ సినిమా అయితే పట్టాలెక్కలేదు. తాజాగా మరోసారి 'ఆదిత్య 369' సీక్వెల్ తెరపైకి వచ్చింది. బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత బాలయ్య 'ఆదిత్య 369' సీక్వెల్ చేయాలని అలోచిస్తున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఈమధ్య తెలుగు ప్రేక్షకులు రొటీన్ సినిమాలకంటే భిన్నమైన చిత్రాలపై ఆదరణ చూపిస్తున్నారని, ఈ సమయంలో ఆదిత్య సీక్వెల్ చేస్తే వారికి తప్పనిసరిగా నచ్చుతుందని భావిస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా సింగీతం పూర్తి చేశారని.. ఫైన్ ట్యూనింగ్ చేస్తే సరిపోతుందని అంటున్నారు. సినిమాకు 'ఆదిత్య 999' టైటిల్ గా అనుకుంటున్నారని గతంలోనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
బాలయ్య కనుక నిజంగా ఈ సినిమా టేకప్ చేస్తే అది డిఫరెంట్ సినిమా అవుతోంది. మరి ఈ ప్రాజెక్ట్ ఈ సారైనా పట్టాలెక్కుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం రెండు మూడు నెలలు వేచి చూడక తప్పదు.