నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న హ్యాట్రిక్ చిత్రం `అఖండ`. సింహా, లెజెండ్ తరవాత వస్తున్న సినిమా ఇది. అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. మేలో విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. అయితే కరోనా వల్ల సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ పై చిత్రబృందం ఓ స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దసరా బరిలో నిలపాలని బోయపాటి భావిస్తున్నాడట. పండగ సీజనే ఈ సినిమాకి సరైనదని.. బాలయ్య కూడా ఫిక్సయ్యాడని టాక్. దసరాకి వస్తున్నాం అంటూ ఏ సినిమా ఇప్పటి వరకూ ప్రకటించలేదు. ఆ లెక్కన... తొలి కర్చీఫ్ బాలయ్యదే.
జులై నుంచి షూటింగులు మొదలయ్యే అవకాశాలున్నాయని పరిశ్రమ భావిస్తోంది. దానికి తగ్గట్టుగానే.. షూటింగ్ ప్లానింగ్స్ మొదలయ్యాయి. జులై తొలి వారంలోనే అఖండ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. మరో 40 రోజులు షూటింగ్ చేస్తే, ఈ సినిమా పూర్తవుతుందని తెలుస్తోంది. జులై, ఆగస్టుల్లో.. షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ మొదలెట్టేస్తే, దసరాకి రావడం పెద్ద సమస్యేం ఉండదు. అయితే.. బాలయ్యకు పోటీగా ఈ దసరా బరిలో ఎవరు దిగుతారో చూడాలి.