స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న 'ఎన్.టి.ఆర్' సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమయ్యింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. దుర్యోధనుడి గెటప్‌లో బాలయ్య కన్పించేసరికి, ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులు, అభిమానులు షాక్‌కి గురయ్యారు. డెడికేషన్ అంటే బాలయ్య, కమిట్‌మెంట్ అంటే బాలయ్య అని మరోసారి నిరూపితమయ్యింది.
మామూలుగా సినిమా ప్రారంభోత్సవమంటే లాంఛనమే గనుక, తూతూమంత్రంగా కానిచ్చేస్తారు. కానీ, బాలయ్య అలా అనుకోలేదు. నెత్తిన కిరీటం, ఒంటి నిండా నగలతో అచ్చం దుర్యోధనుడి గెటప్‌లో వున్న ఎన్టీఆర్‌లా కన్పించారు. ఆభరణాల బరువు మోయడం ఒక ఎత్తయితే, మండుతున్న ఎండల్లో ఆ మేకప్‌లో ఎక్కువసేపు అలా వుండడం ఇంకో ఎత్తు. వీటన్నిటికీ మించి, ముహూర్తం షాట్ కోసం సన్నివేశాన్ని రిహార్సల్ చేసుకుంటూ, డైలాగ్స్‌ని వల్లించుకుంటూ బాలయ్య కన్పించడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.
స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర అంటే ఆషామాషీ కాదు. ఆయన విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా సేవలందించిన మహనీయుడు. తెలుగునాట రాముడన్నా, కృష్ణుడన్నా ఆయన మాత్రమే అనేంతలా సినిమాల్లో అత్యద్భుతమైన పాత్రల్లో కన్పించారు ఎన్టీఆర్. తెలుగు ప్రజలకి ముఖ్యమంత్రిగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా సేవ చేసిన మహనీయుడు. కాబట్టే, తన తండ్రి పాత్ర విషయంలో బాలయ్య ఎక్కడా ఏమాత్రం లైట్ తీసుకోలేదు. దటీజ్ బాలయ్య.