నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఇంకా నిర్ణయించలేదు. కాకపోతే.. రిలీజ్ డేట్ వచ్చేసింది. మే 23న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. బాలయ్య - బోయపాటి కాంబో అనగానే.. అంచనాలు ఆకాశంలో ఉంటాయి. దానికి తగ్గట్టే బోయపాటి అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటూ వస్తున్నాడు.
ఈ సినిమాలో బాలయ్య పాత్ర రెండు రకాలుగా ఉంటుందని, ఓ గెటప్పులో ఆయన అఘోరాగా కనిపిస్తాడని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. బాలయ్య అఘోరాగా ఏంటి? ఆ పాత్రని అభిమానులు జీర్ణించుకుంటారా? అని భయపడ్డారు. అఘోరా అంటే చెప్పేదేముంది? ఒళ్లంతా విభూది.. నగ్నంగా ఉంటారు. జుత్తు పెంచుకుని ఓ భయాకరమైన రూపంలో దర్శనమిస్తుంటారు. అలాంటి పాత్రలో బాలయ్యని ఊహించుకోవడం కష్టమే. ఈ ఫీడ్ బ్యాక్ గమనించిన బోయపాటి.. ఆ పాత్రని సైడ్ చేసేశారని, దాన్ని ఇంకోలా రాసుకున్నారని మరో వార్త బయటకు వచ్చింది.
అయితే బాలయ్య మాత్రం అఘోరాగా కనిపించడానికి డిసైడ్ అయ్యాడట. ఈ కథలో కొత్తదనమే.. అఘోరా పాత్రలో ఉందని, అఘోరా గా నటించడంలో తనకెలాంటి భయాలూ, అనుమానాలూ లేవని బాలయ్య చెప్పడంతో మళ్లీ.. అఘోరా పాత్ర ని ఈ కథలోకి లాక్కొచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం.. బాలయ్యని అఘోరా గెటప్‌లో చూపిస్తూ.. ఆ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఆ గెటప్ ని రిలీజ్‌కి ముందే రివీల్ చేసి, అభిమానుల్ని ప్రిపేర్ చేసేస్తారన్న టాక్ నడుస్తోంది.