నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. పూర్ణ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. మే 23న ఈచిత్రాన్ని విడుదల చేస్తారు. అయితే.. ఇప్పటి వరకూ ఈ సినిమా టైటిల్ ఏమిటన్నది ప్రకటించలేదు. ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో అయితే చాలా టైటిళ్లు వినిపిస్తున్నాయి. అందులో `మోనార్క్` ప్రధానమైనది. దాదాపుగా ఈ టైటిల్ నే ఖాయం చేసేస్తారని చెబుతున్నారు.
అయితే.. మోనార్క్ కంటే మంచి టైటిల్ వేటలో.. బోయపాటి ఉన్నాడని, అందుకే ఇంత సమయం తీసుకుంటున్నాడని కూడా అంటున్నారు. అయితే... ఈ టైటిల్ ఏమిటన్న విషయంలో చిత్రబృందం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న ఈ టైటిల్ ని అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం అందుతోంది.
అంతే కాదు...ఆ రోజున ఓ టీజర్ కూడా.. బయటకు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య పాత్రలో రెండు కోణాలుంటాయి. అఘోరాగానూ ఆయన కనిపిస్తారు. అందుకు సంబంధించిన సన్నివేశాలు ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో తెరకెక్కించారు.