నందమూరి బాలకృష్ణకు సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ. ఈమధ్య బాలయ్య సినిమాలు సంక్రాంతికి విడుదల అవ్వడం, అవి సూపర్ హిట్ కావడం చూస్తూనే ఉన్నాం. బాలయ్య సినిమా అంటే, సంక్రాంతి బరిలో ఉండాల్సిందే అని అభిమానులూ ఫిక్సయిపోయారు. అందుకే బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమానీ సంక్రాంతికే విడుదల చేద్దామనుకున్నారు. బోయపాటి ప్లానింగ్ అదే. 2021 సంక్రాంతికి ఈ సినిమాని ఎలాగైనా విడుదల చేయాలని భావిస్తున్నాడట. అందుకే అక్టోబరులో షూటింగ్ మొదలెట్టి, డిసెంబరు నాటికి సినిమాని పూర్తి చేయాలని, ఆ తరవాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిపి, సంక్రాంతి బరిలో నిలపాలని అనుకున్నాడట.
అయితే... బాలయ్య మాత్రం బోయపాటి ని వెనక్కి లాగుతున్నాడని టాక్. ఇప్పటికిప్పుడు షూటింగ్ మొదలెట్టి, హడావుడిగా పూర్తి చేయొద్దు, నిదానంగానే సినిమాని ముగిద్దాం అంటూ బోయపాటి వేగానికి కళ్లెం వేస్తున్నాడని టాక్. బాలయ్య గురి 2021 వేసవిపై ఉందని, అందుకే బోయపాటిని తొందరపడొద్దని చెబుతున్నాడని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో షూటింగులకు రావడానికి బడా స్టార్లు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఆలస్యం అయినా, మునిగిపోయేదేం లేదన్నది బాలయ్య ఫీలింంగ్. దానికి తోడు... ఎన్టీఆర్ బయోపిక్కులు బాలయ్యనీ, ఆయన అభిమానుల్నీ తీవ్రంగా నిరాశ పరిచాయి. ఈసారి వాళ్లని తప్పకుండా మెప్పించే సినిమానే తీయాలి. అందుకే హడావుడి పడొద్దని చెబుతున్నాడట.