సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ అంటే అందరికీ క్రేజే. తమ బాడీని కొత్తగా చూపించుకోవడానికి దక్కిన అవకాశం. అయితే... ఆరు, ఎనిమిది పలకల దేహాలు తెచ్చుకోవడం, వాటిని కాపాడుకోవడం అంత ఈజీ కాదు. అందుకోసం ఎంతో చమటోడ్కాలి. ఎన్నో త్యాగాలు చేయాలి. ఆ కష్టం ఎలాంటిదో... నాగశౌర్యకి తెలిసొచ్చింది. నాగశౌర్య కథానాయకుడిగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇదో స్పోర్ట్స్ డ్రామా. నాగశౌర్య ఆర్చర్‌గా కనిపించనున్నారు.
ఈ పాత్ర కోసం తన బాడీని మార్చుకోవాలనుకున్నాడు శౌర్య. అందుకోసం లాక్ డౌన్ సమయంలో జిమ్ లో కసరత్తులు చేసి, 8 ప్యాక్ తెచ్చుకున్నాడు. ఎయిట్ ప్యాక్ యాబ్స్ పొందడానికి శౌర్య తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కచ్చితమైన డైట్ ఫాలో అవుతుండటంతో పాటు ప్రతి రోజూ జిమ్‌లో చెమట చిందిస్తున్నారు. ఐదు రోజులుగా ఆయన నీళ్లు కూడా తాగడం లేదు. ఆఖరుకి లాలాజలాన్ని కూడా మింగడం లేదంటే ఫిట్‌నెస్ కోసం ఆయన ఎంతగా శ్రమిస్తున్నారో అర్థం అవుతుంది. మరి ఈ బాడీ.. తెరపై ఏరకంగా కనిపిస్తుందో, శౌర్యని ఎంత కొత్తగా చూపిస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.