అగ్ర కథానాయకుల్లో ఒకరిగా చలామణీ అవుతున్నారు నందమూరి బాలకృష్ణ. అయితే ఆయన పారితోషికం రూ.5 నుంచి 8 కోట్ల లోపే. ఒక్కో సినిమాకీ ఒక్కోలా ఆయన పారితోషికం తీసుకుంటుంటారు. గౌతమిపుత్ర శాతకర్ణికి ఆయన తీసుకున్నది అక్షరాలా 5 కోట్లు. ఎన్టీఆర్ సొంత నిర్మాణ సంస్థలోనే తెరకెక్కించారు కాబట్టి, పారితోషికాన్ని లెక్కగట్టలేదు. పైసా వసూల్ కి 6కోట్లు, ఇప్పుడు రూలర్‌కి మరో 6 కోట్లు తీసుకున్నారు. అయితే.. తన కొత్త సినిమాకి మాత్రం పారితోషికం డబుల్ అయ్యింది.
బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిన్ననే ఈ సినిమా క్లాప్ కొట్టుకుంది. ఈ సినిమాకి బాలయ్య పారితోషికం అక్షరాలా 12 కోట్లని తేలింది. ముందుగా మిర్యాల రవీందర్ రెడ్డి 10 కోట్లు ఇస్తానని చెప్పాడట. అయితే రెండు రోజుల క్రితమే మరో 2 కోట్లు పెంచుతూ బాలయ్య పారితోషికాన్ని 12 కోట్లకు ఫిక్స్ చేశాడట. బాలయ్య -బోయపాటిలది సూపర్ హిట్ కాంబో.
బాలయ్య మిగిలిన సినిమాల మాటెలా ఉన్నా `సింహా`, `లెజెండ్`లు కాసుల వర్షం కురిపించాయి. కాంబినేషన్ కోసమైనా భారీ ఓపెనింగ్స్ వస్తాయని నిర్మాత భావిస్తున్నాడు. అందుకే.. అడిగినంత పారితోషికం ఇవ్వడానికి రెడీ అయ్యాడు. దర్శకుడిగా బోయపాటి స్థానంలో మరొకరు ఉండుంటే... ఈ రేంజు పారితోషికం వచ్చుండేది కాదు. ఇక్కడ విచిత్రమేమిటంటే... బాలయ్య కంటే బోయపాటి పారితోషికమే అధికం. ఈ సినిమాకి గానూ 15 కోట్ల పారితోషికం తీసుకున్నాడు బోయపాటి.