బాలకృష్ణ - బోయపాటి శ్రీను... వీళ్లది తిరుగులేని కాంబినేషన్. సింహా, లెజెండ్, అఖండ.. ఒకదాన్ని మించి మరోటి హిట్ అయ్యాయి. అఖండతో అయితే నందమూరి అభిమానులకు పూనకాలు వచ్చేశాయి.
బాలయ్యకు హిట్ ఇవ్వాలంటే.. బోయపాటినే ఇవ్వాలని వాళ్లంతా ఫిక్సయిపోయారు. మరోసారి ఈ కాంబినేషన్ చూడ్డానికి తహతహలాడిపోతున్నారు. త్వరలోనే ఈ కాంబో మళ్లీ సెట్ కానుంది. ప్రస్తుతం బోయపాటి రామ్ తో ఓ సినిమా చేయాల్సివుంది. ఆ తరవాత అల్లు అర్జున్ తో కూడా ఓ ప్రాజెక్టు ఉంది. ఇవి రెండూ అయ్యేసరికి కనీసం రెండేళ్లయినా పడుతుంది. ఆ తరవాత.. బాలకృష్ణ సినిమా ఉంటుంది. అయితే బాలయ్య మాత్రం `మన కథ త్వరగా రెడీ చేయ్... 2023లో చివర్లో విడుదల అయిపోవాలి` అంటున్నాడట. అంటే... 2023 ప్రారంభంలో ఈ సినిమా పట్టాలెక్కాలి.
రామ్ తో సినిమా పూర్తయిన వెంటనే బాలయ్యతోనే సినిమా మొదలవ్వాలి. మధ్యలో బన్నీతో సినిమా చేసే ఛాన్స్ ఉండదు. 2024లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికలలో.. తన, తన పార్టీ గెలుపుకి తోడ్పడేలా ఈ సినిమా ఉండాలన్నది బాలయ్య ఉద్దేశం. ఎన్నికలు అయిపోయాక సినిమా తీస్తే.. పొలిటికల్ ఎజెండా ప్లాన్ వర్కవుట్ అవ్వదు. అందుకే.. ఎన్నికలకు ముందే, అంటే 2023లోనే సినిమా తీయాలని బాలయ్య పట్టుపడుతున్నాడట. బాలయ్య అడిగితే బోయపాటి కాదనలేడు. అలాగని బన్నీ సినిమాని వదిలేయలేడు. మరి ఏం చేస్తాడో చూడాలి.