బాలకృష్ణ ఎప్పుడూ అంతే. ఎప్పుడు ఏ దర్శకుడి కథకు ఓకే చెబుతాడో, ఎప్పుడు ఏ హీరోయిన్ ఓ జట్టు కడతాడో చెప్పడం కష్టం. జనం మర్చిపోయిన హీరోయిన్లంతా బాలయ్య సినిమాలో ఆఫర్లు కొట్టేస్తుంటారు. రాధికా ఆప్టే, ఇషా చావ్లా, అంజలి... ఇలాంటి వాళ్లకు బాలయ్య పిలిచి మరీ అవకాశాలు ఇచ్చాడు. ఇప్పుడూ అంతే. తెలుగు చిత్రసీమ మర్చిపోయిన పూర్ణకు బాలయ్య సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దొరికింది.
బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇద్దరు కథానాయికలు ఉంటారు. ఓ కథానాయికగా ప్రయాగ మార్టినా ని ఎంచుకున్నారు. రెండో కథానాయికగా అంజలి పేరు గట్టిగా వినిపించింది. ఇప్పుడు పూర్ణని తీసుకున్నార్ట. పూర్ణ సినిమాలు చేసి చాలా కాలం అయ్యింది. తనకెప్పుడూ పెద్ద హీరోలతో ఛాన్సులు రాలేదు. ఇప్పుడు ఓ రియాలిటీ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తోంది. ఇలాంటి దశలో పూర్ణకి ఛాన్స్ ఇవ్వడం గొప్ప విషయమే. పెద్ద హీరోయిన్లంతా బాలయ్య సినిమాల్లో నటించడానికి ఒప్పుకోకపోవడం వల్ల, బడ్జెట్ పరిమితుల వల్ల... ఇలా ద్వితీయ శ్రేణి హీరోయిన్లతో బాలయ్య సర్దుకుపోయాడని టాక్.