కరోనా కోరల్లో చిక్కుకుంది ప్రపంచం. ఎక్కడికక్కడ లాక్ డౌన్. బయటకు వెళ్లడానికి లేదు. వెళ్లిన వారు క్షేమంగా తిరిగొస్తారని గ్యారెంటీ లేదు. అయితే పోలీస్ వాళ్లకు, లేదంటే కరోనాకు దొరికిపోవడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో రెక్కాడితే గానీ, డొక్కాడని వాళ్ల పరిస్థితే దీనంగా తయారైంది. వాళ్లని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. ఆర్యోగం లాంటి కనీస అవసరాల్ని తీర్చడానికి కోట్లకు కోట్లు ఖర్చు చేస్తోంది. సెలబ్రెటీలూ తలో చేయీ వేస్తున్నారు. టాలీవుడ్ స్టార్లు ఇప్పటికే తమ వంతు సహాయం అందిస్తున్నారు. కోట్లకు కోట్లు విరాళాలు ప్రకటించారు. సీసీసీ పేరిట ఓ సంస్థని స్థాపించి, పేద కళాకారుల చేయూత కోసం శ్రమిస్తోంది. ఆ ఖాతాలోనూ లక్షలు విరాళాలు అందిస్తున్నారు.
అయితే ఇప్పటి వరకూ నందమూరి బాలకృష్ణ నుంచి ఎలాంటి సహాయమూ రాలేదు. ఆయన సహాయం ప్రకటించాడా, లేదా? అనేది పెద్ద డౌటు. బాలయ్య కోటి రూపాయల సహాయం ప్రకటించాడని ఇది వరకు వార్తలొచ్చాయి. వాటిలో నిజం ఎంతన్నది ఇంత వరకూ తేలలేదు. హీరోయిన్లెవరూ చిల్లి గవ్వ కూడా విదిలించలేదు. కొంతమంది పెద్ద దర్శకులు సైతం విరాళాలు ఇంత వరకూ ప్రకటించలేదు. రాజమౌళి లాంటి వాళ్లు ఈ విషయంలో మౌనంగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. త్వరలో ఇస్తారా, అసలు ఇచ్చే ఆలోచన వీళ్లకి ఉందా, లేదా? అనేది హాట్ టాపిక్ అయ్యింది.