కరోనా పై పోరాటం విషయంలో టాలీవుడ్ బాగా స్పందించింది. ధారాళంగా విరాళాలు ప్రకటించింది. రెండు తెలుగు ప్రభుత్వాలతో పాటు, ప్రధానమంత్రి సహాయ నిధికి కూడా తమ వంతు సాయాన్ని అందించింది. అంతే కాదు.. సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటైన సీసీసీకీ సాయం చేసింది. స్టార్లంతా ముందుకొచ్చి, తమ స్థాయిలో విరాళాలు అందించినా.. నందమూరి బాలకృష్ణ పేరు మాత్రం ఎక్కడా వినిపించలేదు,కనిపించలేదు. హీరోలంతా వీడియోలు వదిలి, కరోనా బారీన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో విన్నవించుకుంటే - బాలయ్య ఆ ఊసే ఎత్తలేదు. దాంతో బాలయ్యపై విపరీతంగా విమర్శలు మొదలయ్యాయి. యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్‌కి దిగారు. మీమ్స్ బయటకు వచ్చాయి. బాలయ్య కనిపించడం లేదేంటి? అని ఎద్దేవా చేశారు.
బాలయ్య కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు గానీ, ఆ విషయం ఎక్కడా బయటకు రాలేదు అంటూ సెటైర్లు వేశారు. అయితే ఇప్పుడు బాలయ్య ధీటుగా స్పందించాడు. 1.25 కోట్లు ఇచ్చి - మాటలతో కాకుండా చేతలతో గట్టి సమాధానం చెప్పాడు. కాస్త లేటయినా బాలయ్య నుంచి భారీ మొత్తం విరాళంగా రావడంతో నందమూరి ఫ్యాన్స్ సైతం సంతోషిస్తున్నారు. చిరంజీవి ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీసీకి కూడా బాలయ్య విరాళం ప్రకటించడం మంచి పరిణామం. ఇప్పుడైనా బాలయ్యని విమర్శించే నోళ్లు మూతపడతాయేమో చూడాలి.