బిగ్ బాస్ 6 సీజన్ ముగిసింది. గత సీజన్ల కంటే.. రేటింగులు దారుణంగా పడిపోవడం, బిగ్ బాస్ క్రేజ్ అమాంతంగా తగ్గిపోవడం బిగ్ బాస్ నిర్వాహకుల్ని కంగారు పెడుతున్నాయి. మరోవైపు నాగార్జున కూడా బిగ్ బాస్ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. దాంతో.. బిగ్ బాస్... ఇప్పుడు కొత్త హోస్ట్‌లను వెదికి పట్టుకొనే పనిలో పడింది. అందులో భాగంగానే.. బాలకృష్ణతో బిగ్ బాస్ టీమ్ సంప్రదింపులు జరుపుతోంది. అన్నీ కుదిరితే... బిగ్ బాస్ 7లో బాలయ్యని హోస్ట్ గా చూడొచ్చు.కాకపోతే.. బాలయ్య కండీషన్లు కొన్నిఉన్నాయి. అందులో ప్రధానమైన కండీషన్... ఈ షో సెటప్ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి మార్చాలి. దానికీ ఓ కారణం ఉంది. బాలయ్యకూ నాగార్జునకూ మధ్య ఓరకమైన గ్యాప్ ఉంది. ఈ విషయం ఆయా హీరోల అభిమానుకు కూడా తెలుసు. అందుకే.. అన్నపూర్ణ స్టూడియోలో అడుగుపెట్టకూడదని బాలయ్య భావిస్తున్నాడట.
ఒకవేళ బాలయ్యని ఈ షోకి తీసుకురావాలంటే.. షో వేదిక మార్చేయాలి. అది పెద్ద కష్టమేం కాదు. కాకపోతే... సెట్ ఎక్కడ వేసినా.. దాని చుట్టూ బలమైన సెక్యురిటీ వ్యవస్థ ఉండాలి. అన్నపూర్ణ స్టూడియోస్ కాని పక్షంలో..రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సెట్ వేసే అవకాశం ఉంది. పారితోషికం పరంగానూ... బాలయ్య భారీగానే డిమాండ్ చేస్తున్నట్టు టాక్. ఒకవేళ బాలయ్య ఈ షో చేయడానికి ఒప్పుకొంటే... `బిగ్ బాస్ 7` రూపు రేఖలు మొత్తం మారిపోతాయి. క్రేజ్ అమాంతం పెరుగుతాయి. రేటింగులు కూడా ఎక్కడికో వెళ్లిపోతాయి. కాబట్టి.. బాలయ్య అడిగినంత పారితోషికం ఇచ్చి, ఆయన చెప్పే కండీషన్లకు తలాడించాలని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తోంది.