కృష్ణవంశీ తాజా చిత్రం ‘రంగమార్తాండ. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి వాయిస్ తో ఒక షాయరీ ని రూపొందించారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న షాయరీ విడుదలైంది.
‘నేనొక నటుడ్ని
పిడుగుల కంఠాన్ని నేను
అడుగుల సింహాన్ని నేను
నరంనరం నాట్యమాడే నటరాజ రూపాన్ని నేను
ప్రపంచ రంగస్థలంలో పిడికెడు మట్టిని నేను
ప్రచండంగా ప్రకాశించు రంగమార్తండుడ్ని నేను''
ఇలా సాగిన షాయరీ ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ షాయరీ ని చిరంజీవి తన గళంతో ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా చెప్పారు. ఇళయరాజా స్వరాలు అందించారు. ఇటీవల గాడ్ ఫాదర్ కి మాటలు అందించిన లక్ష్మీ భూపాల ఒక నటుడి జీవితాన్ని అద్దంపట్టేలా ఈ షాయరీ రాశారు. షాయరీలో వినిపించిన ప్రతి మాట అర్ధవంతంగా వుంది. ఒక నటుడిలోని అనేక కోణాలు ఆవిష్కరించింది. తర్వలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
పూర్తి షాయరీ :
నేనొక నటుడ్ని..
చమ్కీల బట్టలేసుకుని,
అట్ట కిరీటం పెట్టుకొని
చెక్కకత్తి పట్టుకొని
కాగితం పూల వర్షంలో
కీలుగుర్రంపై స్వా రీ చేసే
చక్రవర్తిని నేను..
కాలాన్ని బంధంచి శాసించే
నియంతని నేను...
నేనొక నటుడ్ని..
నాదికాని జీవితాలకు
జీవం పోసే నటుడ్ని..
నేనుకాని పాత్రల కోసం
వెతికే విటుడ్ని..
వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని,
వేషం తీస్తే ఎవరికి కానీ జీవుడ్ని..
నేనొక నటుడ్ని..
నవ్విస్తాను. ఎడ్పిస్తాను
ఆలోచనల సంద్రంలో ముంచేస్తాను
హరివిల్లుకి ఇంకో రెండు రంగులేసి
నవరసాలు మీకిస్తాను
నేను మాత్రం నలుపు తెలుపుల
గంరరగోళంలో బ్రతుకుతుంటాను
నేనొక నటుడ్ని..
జగానికి జన్మిస్తాను
సగానికి జీవిస్తాను
యుగాలకి మరణిస్తాను
పోయినా బ్రతికుంటాను .
నేనొక నటుడ్ని..
లేనిది వున్నట్టు చూపే కనికట్టుగాన్ని
ఉన్నది లేనట్టు చేసే టక్కుటమారపోడ్ని
ఉన్నదంతా నేనే అనుకునే అహం బ్రహ్మస్మిని
అసలు వున్నానో లేనో తెలియని ఖారి మనిషిని
నేనొక నటుడ్ని..
గతానికి వారధి నేను..
వర్తమాన సారధి నేను..
రాబోయే కాలంలో
రాబోయే చరిత్రని నేను
పూట పూటకి రూపం మార్చుకొనే
అరుదైన జీవిని నేను.
నేనొక నటుడ్ని
పిడుగుల కంఠాన్ని నేను
అడుగుల సింహాన్ని నేను
నరంనరం నాట్యమాడే
నటరాజ రూపాన్ని నేను
ప్రపంచ రంగస్థలంలో
పిడికెడు మట్టిని నేను
ప్రచండంగా ప్రకాశించు
రంగమార్తండుడ్ని నేను
నేనొక నటుడ్ని..
అసలుమఖం పోగొట్టుకున్న అమాయకుడ్ని
కనీ తొమ్మిది తలలున్న
నట రావణున్ని
నింగి నేలా రెండడుగులైతే
మూడో పాదం మీ మనసులపై
మూపే వామనున్ని
మీ అంచనాల దాటే అజానాబాహుడ్ని
సంచలనాలు సృష్టించే మరో కొత్త దేవుడ్ని
నేనొక నటుడ్ని..
అప్సరసల ఇంద్రుడ్ని
అందుబాటు చంద్రున్ని
అభిమానుల దాసుడ్ని
అందరికీ ఆప్తుడ్ని
చప్పట్లను భోంచేస్తూ
ఈలల్నే స్వాసిస్తూ
అనుక్షణం జీవించే
అల్ప సంతోషిని నేను
మహా అద్రుష్టవంతుడ్ని నేను
తీర్చలేని రుణమేదో
తీర్చాలని తపించే
సగటు కళాకారుడ్ని నేను
ఆఖరి శ్వాస వరకూ
నటనే ఆశ నాకు
నటుడిగా నన్నిష్టపడ్డందుకు
శతకోటి నమస్సులు మీకు