చిత్రసీమ చాలా విచిత్రాలకు కొలవు. ఒకరు చేయాల్సిన కథ మరొకరి దగ్గరకు వెళ్తుంది. వాళ్ల కథ వీళ్లకొస్తుంది. బియ్యపు గింజలపై భగవంతుడు పేరు రాసిపెట్టినట్టు, కథలపై కూడా హీరోల పేర్లు చెక్కబడి ఉంటాయేమో.? అలా కథల మార్పిడి చేసుకున్నారు బాలకృష్ణ.. గోపీచంద్. బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన చిత్రం 'రూలర్'. ఈ చిత్రానికి పరుచూరి మురళి కథ అందించారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించారు. నిజానికి ఈ కథ గోపీచంద్ చేయాల్సింది.
పరుచూరి మురళి గోపీచంద్ కోసమే ఈ కథ తయారు చేసుకున్నారు. పరుచూరి మురళి దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడిగా ఈ సినిమా పట్టాలెక్కాల్సింది. కానీ కుదర్లేదు. ఆ కథ అటు తిరిగి, ఇటు తిరిగి బాలయ్య చేతికి చిక్కింది. ఇప్పుడూ అదే వరుస. గోపీచంద్ - తేజ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'అలివేలు వేంకటరమణ'. త్వరలోనే పట్టాలెక్కబోతోంది. నిజానికి ఈ కథ గోపీచంద్ కంటే ముందు బాలయ్యకు చెప్పాడట. కానీ బాలయ్య ఒప్పుకోలేదు. అది గోపీచంద్ ఖాతాలోకి వెళ్లింది. గోపీచంద్ వదిలేసిన 'రూలర్' ఫ్లాప్ అయ్యింది. మరి 'అలిమేలు..' జాతకం ఏమిటో?