నందమూరి బాలకృష్ణ ఎప్పుడు ఎక్కడ కనిపించినా - `జై బాలయ్య.. జై జై బాలయ్య` అంటూ అభిమానులు నినాదాలు చేస్తారు. ఆ పిలుపు బాలయ్యకీ బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఇదే పిలుపు టైటిల్ గా మారిపోతోంది. బాలయ్య సినిమా కోసం. నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి `జై బాలయ్య` అనే పేరు ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఇందులో బాలకృష్ణ పాత్ర పేరు.. బాల. అందుకే ఈ టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం. ఇది వరకు నాని కూడా తన సినిమాకి `జై బాలయ్య` అనే పేరు పెట్టాలనుకున్నాడు. కృష్ణ గాడి వీర ప్రేమ గాథ కోసం `జై బాలయ్య` పేరు పరిశీలించారు.
అందులో నాని బాలయ్య అభిమానిగా కనిపిస్తాడు. అందుకే ఆ పేరు పెట్టాలనుకున్నారు. కానీ కుదర్లేదు. ఈసారి బాలయ్య సినిమాకైనా ఆ పేరు పెడతారేమో చూడాలి. నిజంగా జై బాలయ్య పేరుతో ఈసినిమా వస్తే - బాలయ్య అభిమానులకు పండగే. ప్రస్తుం అఖండతో బిజీగా ఉన్నాడు బాలయ్య. షూటింగ్ పూర్తయ్యింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే గోపీచంద్ మలినేని సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.