టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లకు అత్యంత సన్నిహితుడు, పీఆర్వో, పాత్రికేయుడు, నిర్మాత మహేష్ కోనేరు కన్నుమూశారు. ఈరోజు ఉదయం విశాఖపట్నంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు మహేష్. కల్యాణ్ రామ్ తో రెండు సినిమాలు (నా నువ్వే, 118) చిత్రాల్ని నిర్మించిన మహేష్... `తిమ్మరుసు`తో కమర్షియల్ హిట్ అందుకున్నారు. కీర్తి సురేష్‌నటించిన `మిస్ ఇండియా`కి ఆయనే నిర్మాత. ఇటీవల అల్లరి నరేష్ తో `సభకు నమస్కారం` అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు.
నాగశౌర్యతో ఓసినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పనుల నిమిత్తం విశాఖపట్నం వెళ్లిన మహేష్ కి ఈ రోజు ఉదయం 8.30 గంటలకు గుండెపోటు వచ్చింది. వెంటనే సన్నిహితులు ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలోనే ఆయన మరణించారు. మహేష్ కోనేరు మృతితో టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ఆయన మృతికి పలువురు కథానాయకులు, నిర్మాతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.