మా ఎన్నికలు ఎంత రసవత్తరంగా జరిగాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఫలితాలు కూడా అలానే వచ్చాయి. గెలుస్తారనుకున్నవాళ్లు ఓడారు. ఓడతారు అనుకున్నవాళ్లు గెలిచారు. అనసూయ మాత్రం గెలిచి ఓడింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ తరపున ఈసీ మెంబర్ గా అనసూయ పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం అనసూయ గెలిచిందని చెప్పారు. తీరా సోమవారం తుది ఫలితాల్లో అనసూయ పేరు కనిపించలేదు. అనసూయ ఓడిపోయిందంటూ అధికారికంగా ప్రకటించారు. దాంతో అంతా అయోమయానికి గురయ్యారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లని కూడా లెక్కించాక అనసూయ ఓడిపోయిందంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
దీనిపై అనసూయ ఫైర్ అయ్యింది. కేవలం 900 ఓట్లు కూడా లేని ఎన్నికలలో, పోలైన ఓట్లు లెక్కించడానికి రెండు రోజులు ఎందుకు తీసుకున్నారు? ఎవరో పోస్టల్ బ్యాలెట్లని ఇంటికి కూడా పట్టుకెళ్లారని తెలిసింది.... అంటూ - ట్వీట్ చేసింది. ఒకరు గెలిచారని చెప్పి, ఆ తరవాత ఓడిపోయారని ప్రకటించడం - బహుశా `మా` చరిత్రలో ఇదే మొదటిసారేమో...? ఈ విషయమై అనసూయ చాలా గుర్రుగా ఉందట. తనని కావాలనే ఓడించారని, దీని వెనుక కుట్ర ఉందని అనసూయ గట్టిగా భావిస్తోందట. `నిజాయతీగా రాజకీయం చేయాలనుకున్నా. కానీ నన్ను ఓడించారు` అని తన సన్నిహితుల దగ్గర వాపోతోందని టాక్.