ఈమధ్య తెలుగు చిత్రసీమ మీటింగులపై మీటింగులు పెడుతోంది. టాలీవుడ్ అంతా ఏకమై ప్రభుత్వాన్ని షూటింగుల కోసం ఒప్పించడానికి తంటాలు పడుతోంది. ఎన్నో ప్రతిపాదనలు. ఇంకెన్నో సమస్యలు. అవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ మీటింగులో ఇండ్రస్ట్రీ పెద్దలంతా పాల్గొంటున్నారు. మరీ ముఖ్యంగా చిరంజీవి ఈ మీటింగులకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. నాగార్జున కూడా కనిపిస్తున్నారు. మరి.. ఏ మీటింగులో చూసినా బాలకృష్ణే కనిపించడం లేదు. చిత్రసీమలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌ని దిగ్గజ హీరోలుగా కొలుస్తారు.. కొలుస్తున్నారు. అలాంటి నలుగురిలో బాలయ్యకు ఈ మీటింగుల్లో చోటెందుకు లేదు? ఆయన్ని పిలవడం లేదా? పిలిచినా బాలయ్యే రావడం లేదా?
నిజానికి బాలయ్య ఇలాంటి కార్యక్రమాలంలో హుషారు ప్రదర్శిస్తారు. హుద్ హుద్ సమయంలో `మేము సైతం` అనే కార్యక్రమం నిర్వహించింది టాలీవుడ్. ఆ సమయంలో బాలయ్యదే హవా. మరి ఇప్పుడు మాత్రం ఆయన పత్తా లేడు. కొంతమంది బాలయ్యని ఆహ్వానించినా, ఆయన రాలేదని చెబుతుంటే, ఇంకొంతమంది అసలు బాలయ్యని ఎవరూ పిలవలేదని అంటున్నారు. నిజానిజాలేంటో బాలయ్యకే ఎరుక. చిత్రసీమకు సంబంధించిన కార్యక్రమాలకు బాలయ్య లాంటి పెద్ద హీరోలూ హాజరైతే, ఆ ఐకమత్యమే వేరుగా కనిపిస్తుంది. మరెందుకో ఈ విషయాన్ని బాలయ్య పట్టించుకోవడంలేదు. హీరోలకు ఈగోలున్నా, ఇలాంటి సమయంలో వాటిని పక్కన పెట్టాలి. దురదృష్టం ఏమిటంటే.. అదే జరగడం లేదిక్కడ.