జనవరి 12న 'జై సింహా' సినిమా రిలీజ్ అవుతుంది. సంక్రాంతికి బాలయ్య నుండి ఏ సినిమా వచ్చినా, ఆ సినిమాపై కనీ వినీ ఎరుగని రీతిలో అంచనాలుంటాయి. అందుకు కారణం సంక్రాంతికి వచ్చిన బాలయ్య గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించడమే. ఇప్పుడీ 'జై సింహా' కూడా ఆ సూపర్ హిట్స్ సరసన చేరుతుందని బాలయ్య అభిమానులు విశ్వసిస్తున్నారు.
సినిమా గురించి నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్‌గా ఈ సినిమా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సినిమాలో బాలకృష్ణ నయనతార మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందట. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన 'సింహా', శ్రీరామరాజ్యం' సూపర్ హిట్స్ అయ్యాయి. అలా ఈ సినిమా హిట్ అయ్యి, ఈ కాంబినేషన్‌కి హ్యాట్రిక్ లభించనుందని నిర్మాత అంటున్నారు. సినిమాలోని హైలైట్స్ గురించి చెబుతూ బాలయ్య డాన్సులు, నయనతార గ్లామర్, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, కుంభకోణంలో చిత్రీకరించిన సన్నివేశాలు అత్యద్భుతంగా వచ్చాయనీ సి. కళ్యాణ్ తెలిపారు.
కె.యస్.రవికుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. నయనతారతో పాటు నటాషా దోషీ, హరిప్రియ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతేడాది 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాతో సంక్రాంతి హిట్ కొట్టాడు బాలయ్య. ఈ ఏడాది సంక్రాంతికి పంచభక్ష్య పరమాన్నంలాంటి సినిమాగా 'జై సింహా' ప్రేక్షకుల ముందుకు రాబోతోందని నిర్మాత సి. కళ్యాణ్ మాటలు నిజమవ్వాలని, బాక్సాఫీస్ బొనంజా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ఆశిద్దాం.