నందమూరి బాలకృష్ణ కోసం కథానాయికల వేట కొనసాగుతూనే ఉంది. బాలయ్య - కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్తుంది. మెహరీన్, పాయల్ రాజ్ పుట్ లాంటి పేర్లు పరిశీలించారు. కానీ... వాళ్ల కాల్షీట్లు అందుబాటులో లేవు. దాంతో ఎప్పటిలా సీనియర్ కథానాయికలవైపు దృష్టి పెట్టాడు బాలయ్య. నయనతార, కాజల్, శ్రియలలో ఒకరిని ఎంచుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు.
నయన ప్రస్తుతం తెలుగు సినిమాల్ని ఒప్పుకునే పరిస్థితిలో లేదు. కాజల్ కోటికి తక్కువ తీసుకోవడం లేదు. ఇక శ్రియనే సరైన ఆప్షన్. చెన్నకేశవరెడ్డి, గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ సినిమాల్లో ఇద్దరూ జంటగా కనిపించారు. బాలయ్య పక్కన శ్రియ చూడ్డానికి బాగానే ఉంటుంది. పైగా ఇద్దరి మధ్య కూడా రాపో బాగా పెరిగింది. అందుకే శ్రియని ఖరారు చేయాలని బాలయ్య భావిస్తున్నాడట. శ్రియ కూడా ప్రస్తుతం ఖాళీగానే ఉంది. సో.. వీరి కాంబో దాదాపుగా ఖాయమైపోయినట్టే అన్నమాట.