కొన్ని సినిమాలు సెట్స్ మీదికెళ్లి ఆగిపోతుంటాయి. సినీ పరిశ్రమలో చాలా మామూలు విషయం ఇది. కానీ తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ రూపొందించాలన్న బాలయ్య సంకల్పానికి అడ్డంకులు ఎదురవుతుండడం అందర్నీ ఆశ్యర్యపరుస్తోంది. తేజ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. బాలయ్య తలచుకుంటే, పది మంది ప్రముఖ దర్శకులు ఈ ప్రాజెక్ట్ కోసం ముందుకొస్తారు. డైరెక్టర్ విషయం కాదిక్కడ. సమస్య స్వర్గీయ ఎన్టీఆర్ జీవితంలోనే ఉంది.
ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమే అయినా, జీవిత చరమాంకంలో ఆయన చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, అర్ధాంతరంగా తనువు చాలించాల్సి వచ్చింది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర అంటే, ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన ఆయన కీర్తి మాత్రమే కాదు, పాతాళానికి పడిపోయిన పరువు ప్రతిష్టలు కూడా ఉన్నాయి. శిఖరం చూపిస్తే, పాతాళం గురించిన ప్రశ్నలొస్తాయి. అందుకే బయోపిక్‌కి సంబంధించి, కథ కుదరడం లేదు.
కేవలం సినీ ప్రస్థానాన్ని ప్రస్థావించేస్తే, అది బయోపిక్ అవ్వదు. రాజకీయాంశాలు చూపించాలంటే, అంత సాహసం ఎవరూ చేయలేరు. కాబట్టి ఎన్టీఆర్ సినిమా అటకెక్కిపోయినట్లే. కానీ బాలయ్య ఈ సినిమా చేయాలనే కసితోనే ఉన్నాడట. అయితే సాధ్యమయ్యే పనేనా అది? వేచి చూడాల్సిందే.