కీర్తి సురేస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మహానటి' చిత్రం ఓవర్సీస్‌లో 1.6 మిలియన్స్ వసూళ్లు కొల్లగొట్టి, ఇంకా నాటౌట్‌గా నిలిచింది. అతి తొందర్లోనే 2 మిలియన్స్ క్లబ్‌లోకి చేరనుంది. ఎవరూ ఊహించిని అంశం ఇది. మహానటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కిన ఈ చిత్రం కొన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రమే మెప్పించగలదని భావించారంతా. కానీ అనూహ్యంగా అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాకి ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా యూత్ ఎక్కువగా కనెక్ట్ అవుతుండడం విశేషం.
అలనాటి కాలం నాటి మహానటి జీవిత చరిత్రను ఈ తరం వారికి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ని అందుకే అందరూ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. సావిత్రి అంటే, బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి హీరోయిన్. తెరపై హుందాగా కనిపించింది. అందం, అభినయం ఇవే ఆమెలో కనిపించే అపురూపమైన లక్షణాలు అనుకున్నవారికి, సావిత్రి చిన్నతనంలో ఎలా ఉండేది? ఎంత కష్టపడి సినీ రంగంలో అవకాశాలు దక్కించుకుంది? ఎంతగా ఉన్నత స్థాయికి ఎదిగింది? ఎలా పతనమైపోయింది? ఈ అంశాలన్నీ చాలా పుస్తకాల్లో చదివేసినప్పటికీ, నాగ్ అశ్విన్ తెరపై ఆవిష్కరించిన తీరు ప్రేక్షకుల్ని విశేషంగా మెప్పిస్తోంది.
అదే క్లాస్, మాస్, ఏజ్ డిఫరెన్స్ లేకుండా అందర్నీ ధియేటర్స్‌కి రప్పిస్తోంది. ఆమె కథను హృద్యంగా మలచడంతో పాటు, అక్కడక్కడా కమర్షియల్ ఎలిమెంట్స్ అయిన ఎంటర్‌టైన్ మెంట్‌ని కూడా మర్చిపోలేదు నాగ్ అశ్విన్. అదే ఈ సినిమాకి ఇంత ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఓవర్సీస్‌లో ఈ స్థాయిలో 'మహానటి' వసూళ్లు ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉన్నాయి.